HEALTH CARE: నాణ్యమైన వైద్యసేవల అందుబాటులో భారత్ స్థానం 145

  • మనకంటే ఎగువన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, చైనా
  • మనకంటే దిగువన నేపాల్, పాకిస్తాన్
  • ఐస్ లాండ్, నెదర్లాండ్స్ అగ్ర స్థానంలో
  • లాన్సెట్ అధ్యయనం వెల్లడి

నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండడం, వాటిని పొందే విషయంలో మన దేశంలో పరిస్థితులు ఏమంత బాగోలేవని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది. 195 దేశాల జాబితాలో భారత్ 145వ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయంలో చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ కంటే మన దేశం వెనుకబడి ఉన్నట్టు లాన్సెట్ తెలియజేసింది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ పేరుతో లాన్సెట్ ఈ అధ్యయనం నిర్వహించింది.

1990 నాటితో పోలిస్తే మెరుగైన వైద్య సేలను పొందడం, అందుబాటు విషయంలో భారత స్థానం మెరుగుపడినట్టు తెలిపింది. 1990లో భారత స్కోరు ఈ విషయంలో 24.7గా ఉండగా, అది 2016లో 41.2కు చేరింది. గోవా, కేరళ అత్యధిక స్కోరుతో మెరుగ్గా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలు నాణ్యమై వైద్య సేవల విషయంలో 60 స్కోరును దాటాయి. అసోం, యూపీ రాష్ట్రాల్లో ఇది చాలా తక్కువగా 40లోపు ఉంది.

అంతర్జాతీయంగా చూస్తే భారత స్థానం 145 కాగా, చైనా (48), శ్రీలంక (71), బంగ్లాదేశ్ (133), భూటాన్ (134), నేపాల్ (149), పాకిస్తాన్ (154), అఫ్ఘానిస్తాన్ 191వ స్థానాల్లో ఉన్నాయి. నాణ్యమైన వైద్య సేవల విషయంలో ఐస్ లాండ్ 97.1 పాయింట్ల స్కోరుతో ప్రథమ స్థానంలో ఉండగా, నార్వే 96.6, నెదర్లాండ్స్ 96.1, లగ్జెంబర్గ్ 96, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా 95.9 స్కోరుతో టాప్ లో ఉన్నాయి. అతి తక్కువ స్కోరుతో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (18.6), సోమాలియా (19), గునియా (23.4), చాద్ (25.4), అప్ఘానిస్తాన్ (25.9) దిగువ స్థాయిలో ఉన్నాయి.

More Telugu News