Bollywood: రూ.240 కోట్ల కోసమే శ్రీదేవిని చంపేశారా?.. మళ్లీ తెరపైకి శ్రీదేవి డెత్ మిస్టరీ!

  • శ్రీదేవి మృతి విషయంలో ఆద్యంతం బోల్డన్ని అనుమానాలు
  • నిర్మాత సునీల్ సింగ్ పిటిషన్‌లోని వివరాలు సోషల్ మీడియాలో హల్‌చల్
  • శ్రీదేవి మృతి వెనక దావూద్ హస్తం: రిటైర్డ్ పోలీస్ అధికారి

బాలీవుడ్ నటి శ్రీదేవి మరణం మరోమారు హాట్ టాపిక్ అయింది. ఆమె పేరున ఉన్న రూ.240 కోట్ల బీమా సొమ్ము కోసమే శ్రీదేవిని హత్య చేశారన్న తాజా వార్త సంచలనమైంది. శ్రీదేవి మరణంపై సమగ్ర దర్యాప్తు కోరుతూ నిర్మాత సునీల్ సింగ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ఇటువంటి సంచలన విషయాలు మరెన్నో ఉన్నాయి. అయితే, శ్రీదేవి మరణంపై దర్యాప్తు అవసరం లేదని అప్పట్లో ఈ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. అయితే, అందులోని అంశాలు ఇప్పుడు బయటకొచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

సునీల్ సింగ్ పిటిషన్‌లో పేర్కొన్న ప్రకారం.. శ్రీదేవి తన పేరిట ఒమన్‌లో రూ.240 కోట్లకు జీవిత బీమా తీసుకున్నారు. ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే ఆ సొమ్ము ఆమె వారసులకు దక్కుతుందన్న నిబంధన ఉంది. అయితే, ఈ విషయంలోనూ పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందులో మొదటిది ఓ వ్యక్తి పేరిట రూ.240 కోట్లకు బీమా ఇస్తారా? అన్నది తొలి సందేహం కాగా, బీమాదారు దుబాయ్‌లో మరణిస్తేనే ఆ సొమ్ము వారి వారసులకు ఇస్తారా? అనేది రెండోది. నిజానికి ఇలాంటి నిబంధనలు ఏ జీవిత బీమా సంస్థలోనూ ఉండవని పోలీసులు చెబుతున్నారు.

ఈ అనుమానాలను పక్కనపెడితే శ్రీదేవి మరణం అనుమానాస్పదమేనని ఇప్పటికీ చాలామంది విశ్వసిస్తున్నారు. మరోవైపు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు దుబాయ్ అడ్డా అని, కాబట్టి శ్రీదేవి మరణంలో అతడి పాత్ర కూడా ఉండొచ్చనేది మరో వాదన. ఇస్లామిక్ దేశమైన దుబాయ్‌లో దావూద్ దర్యాప్తును ప్రభావితం చేయగలడని వేద్‌భూషణ్ అనే రిటైర్డ్ ఏసీపీ పేర్కొన్నారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతి చెందారన్న విషయం నమ్మశక్యంగా లేదని ఆయన గతంలోనే పేర్కొన్నారు. శ్రీదేవి మరణంపై ఇటీవల ఆయన తన బృందంతో కలిసి దర్యాప్తు కూడా జరిపారు. దుబాయ్‌లో శ్రీదేవి మరణించిన హోటల్‌కు వెళ్లారు. అయితే శ్రీదేవి మరణించిన రూములోకి వెళ్లేందుకు సిబ్బంది నిరాకరించారు.

తనకొచ్చిన అనుమానాలు నిజమైతే శ్రీదేవిది తప్పకుండా హత్యే అవుతుందని వేద్‌భూషణ్ తేల్చి చెప్పారు. దుబాయ్‌లో ఆమె మరణించిన హోటల్ దావూద్‌దేనని, కాబట్టి ఆమె మరణంలో అతడి పాత్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణానికి గల కారణాన్ని కేవలం 60 గంటల్లోనే తేల్చేశారంటే దీని వెనక కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

More Telugu News