Andhra Pradesh: ఏపీలో చిట్ ఫండ్ కంపెనీల పర్యవేక్షణకు ప్రత్యేక మానిటరింగ్ సెల్

  • చిట్ ఫండ్ కంపెనీల్లో అక్రమాల కేసులను త్వరగా పరిష్కరించాలి
  • నకిలీ కరెన్సీ నిరోధానికి తగిన చర్యలు చేపట్టాలి
  • గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాకింగ్ సేవలు పూర్తిగా అందుబాటులోకి తేవాలి: ఏపీ సీఎస్ ఆదేశాలు

ఏపీలో ఉన్న వివిధ చిట్ ఫండ్ కంపెనీల రోజువారీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 14వ రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని అమరావతి సచివాలయంలో ఈరోజు నిర్వహించారు.

ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఐజి రిజిస్ట్రేషన్స్ వారి కార్యాలయంలో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఏఏ చిట్ ఫండ్ కంపెనీలు ప్రజల నుండి ఎంత మేరకు సొమ్ము సేకరించింది, వాటి ఆస్తులు, పనితీరు ఎలాగుందనే వివిధ అంశాలను ఎప్పటికప్పుడు ఈ ప్రత్యేక సెల్ మానిటర్ చేయాలని చెప్పారు. నకిలీ చిట్ ఫండ్ కంపెనీలను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మోసపూరిత ఎస్ ఎంఎస్ లపై  ప్రజలను అప్రమత్తం చేయాలి

అదే విధంగా ఆర్థికపరమైన కార్యకలాపాల విషయంలో తప్పుడు సందేశాలు ఇచ్చి ప్రజలను మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని దినేష్ కుమార్ ఆదేశించారు. ముఖ్యంగా ఫలానా మొబైల్ నంబరుకు లాటరీ తగిలిందనో లేక బహుమతి వచ్చిందనో నమ్మించి డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పిన్, ఇతర వివరాలు కావాలని అడిగే మోసపూరితమైన సందేశాలు లేదా ఎస్ ఎంఎస్ లను నమ్మి ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పారు. ఇందుకుగాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాను,ఎఫ్ ఎం రేడియో, ఇతర ప్రచార మాద్యమాల్లో ప్రచార అవగాహనా కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలని సూచించారు. అదేవిధంగా సినిమా థియేటర్లలో సంక్షిప్త డాక్యుమెంటరీలు ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాగా, గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రాలేదని అన్నారు. ఈ విషయంలో ఆర్ బిఐ ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో అవసరానికి మించి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటున్నా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మాత్రం ప్రజలకు ఇంకా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాలేదని, ఇప్పటికైనా ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 616 చిట్ ఫండ్ కంపెనీలు (రిజిష్టర్డ్) నిర్వహించ బడుతున్నాయని స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషనల్ శాఖ ఐజి వెంకటరామి రెడ్డి వివరించారు.

ప్రచార కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాం

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆంధ్రా, తెలంగాణా ప్రాంత రీజనల్ డిప్యూటీ డెరెక్టర్ ఆర్.సుబ్రహ్మణ్యన్ అజెండాను వివరించారు. ఆర్థికపరమైన అంశాలలో నకిలీ సందేశాలు, ఇతర మార్గాల ద్వారా ప్రజలను మోసం చేసే వారిపై అప్రమత్తంగా ఉండేలా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. దీనిలో భాగంగా ప్రత్యేక హోర్డింగ్ లు, బస్సులపై ప్రకటనలు రాయించడం జరుగుతోందని చెప్పారు. అలాగే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఎఫ్ ఎం రేడియో ద్వారా ప్రచార కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.అనంతరం గత సమావేశపు నిర్ణయాల మినిట్స్ ను ఆమోదించడం తోపాటు అజెండాలోని ఇతర అంశాలను సభ ముందు ఉంచగా వాటిపై సమావేశంలో సవివరంగా చర్చించారు. 

More Telugu News