jupally: రోడ్ల పక్కన ముళ్ల పొదలను వెంటనే తొలగించండి: తెలంగాణ మంత్రులు జూపల్లి, తుమ్మల

  • బీటీ రోడ్ల పక్కన, బస్సులు వెళ్లే రోడ్లకు తొలి ప్రాధాన్యత 
  • హరితహారం ప్రారంభించేలోగా ముళ్లపొదల తొలగింపు
  • రేపటి నుంచే పనులు ప్రారంభించండి

రహదారుల పక్కన ఇబ్బందికరంగా మారిన ముళ్ల పొదలు, తుమ్మ చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. ముళ్ల పొదల తొలగింపుపై హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో ఈరోజు ఆర్అండ్‌బీ, పంచాయతీరాజ్ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు.

ఆర్అండ్‌బీ పరిధిలో ఉన్న 25 వేల కిలో మీటర్లతో పాటు పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న 67,500 కిలోమీటర్ల రహదారుల పొడవునా ముళ్ల పొదలు, తుమ్మ చెట్లను తొలగించేందుకు రేపటినుంచే రంగంలోకి దిగాలని అధికారులకు సూచించారు. ఇందులోనూ ప్రధానంగా బీటీ రోడ్లు, బస్సులు ప్రయాణించే రహదారుల పక్కన ఉన్న ముళ్ల పొదలను ముందుగా తొలగించాలన్నారు.

ఇందుకోసం జేసీబీలను అద్దెకు తీసుకోవాలని, ఒక్కో జేసీబీ రోజుకు ఎన్ని కిలోమీటర్ల పొడవున చెట్లను తొలగించగలదో అంచనా వేయాలన్నారు. ఇందుకోసం అవసరమున్న చోట ఉపాధి కూలీలను కూడా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేలోగానే ముళ్లపొదల తొలగింపు పూర్తి అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రులు సూచించారు. 10-15 రోజుల్లోనే ఈ కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే రోడ్ల విస్తరణకు ఉన్న అవకాశాన్ని గమనిస్తూ హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే సందర్భంలో ఈ విషయాన్ని గుర్తుంచుకొని, రోడ్డుకు కొంత దూరంలో మొక్కలు నాటాలన్నారు. ముళ్లపొదల తొలగింపునకు ముందు, తొలగించిన తరువాత వీడియోలను తీసి ఆన్‌లైన్‌లో అప్ లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్అండ్‌బీ ముఖ్య కార్యదర్శులు వికాస్ రాజ్, సునీల్ శర్మ, ఈఎన్సీలు సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రావు, గణపతి రెడ్డి, అధికారులు తిరుపతి రెడ్డి, సైదులు తదితరులు పాల్గొన్నారు.           

  • Loading...

More Telugu News