Karnataka: కుమారస్వామి నిర్ణయంతో డైలమాలో కేసీఆర్!

  • ఎల్లుండి కుమారస్వామి ప్రమాణ స్వీకారం
  • కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కనున్న జేడీఎస్
  • బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్
  • ప్రమాణ స్వీకారానికి వెళ్లే విషయంలో నిర్ణయం తీసుకోని కేసీఆర్

కన్నడనాట జేడీఎస్ నేత కుమారస్వామి గత వారం రోజుల వ్యవధిలో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను డైలమాలో పడేసినట్టుగా తెలుస్తోంది. ఎల్లుండి కాంగ్రెస్ సహకారంతో కుమారస్వామి సీఎం పదవికి అధిరోహించనుండగా, ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్ కు సైతం ఆహ్వానం అందింది. టీఆర్ఎస్ వర్గాల సమాచారం మేరకు, ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు అవుతారా? లేదా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. సీఎం సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు తీసుకుంటున్న కుమారస్వామి వైఖరిపై కొంత అసంతృప్తితో ఉన్నారు.

కర్ణాటక ఎన్నికల వేళ, అక్కడ స్థిరపడిన తెలుగువారు జేడీఎస్ కు ఓటేయాలని కేసీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేసిన పార్టీ వర్గాలు, కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ కు ప్రధాన శత్రువులని వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తరువాత కన్నడనాట రాజకీయం మొత్తం మారిపోవడం, జేడీఎస్ ను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ అధికారాన్ని పంచుకుంటూ ఉండటంతో బెంగళూరుకు వెళ్లే విషయంలో కేసీఆర్ ఇంకా ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు.

ఇక ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగళూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ కు తమ ఎమ్మెల్యేలను పంపేముందు, వారి భద్రత, ఏర్పాట్ల విషయమై దేవెగౌడ, కుమారస్వామి విడివిడిగా కేసీఆర్ కు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ మిత్రత్వాన్ని దృష్టిలో ఉంచుకుని దేవెగౌడ కోసం, కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News