amith shah: ముగిసిన ‘కర్ణాటకం’.. 2019 ఎన్నికలపై బీజేపీ చీఫ్ అమిత్ షా దృష్టి!

  • కోస్తా రాష్ట్రాలపై దృష్టి సారించిన అమిత్ షా
  • వచ్చే నెలలో తెలంగాణలో పర్యటన
  • కేడర్ బలోపేతానికి కృషి

ఎత్తులు, పైఎత్తులతో కూడిన వారం రోజుల కర్ణాటక హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. ఇక కాంగ్రెస్-జేడీఎస్ కూటమి గద్దెనెక్కడమే తరువాయి. కర్ణాటకలో పీఠమెక్కి దక్షిణాదిలో కాలుమోపాలని ప్రయత్నించి భంగపడిన అమిత్ షా సారథ్యంలోని బీజేపీ, ఇప్పుడు 2019 ఎన్నికలపై దృష్టి సారించింది.

అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక భంగపడిన బీజేపీ ముఖ్యనేతలంతా వచ్చే ఏడాది ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు. కోస్తా రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణపైనా అమిత్ షా దృష్టిసారించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 105 లోక్‌సభ సీట్లు ఉండగా, మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు ‘ప్లాన్’ రెడీ చేస్తున్నారు.

అలాగే, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలకు ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనా దృష్టి పెట్టారు. ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని కాపాడుకునేందుకు పావులు కదుపుతోంది. త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి కేడర్‌ను బలోపేతం చేయాలని అమిత్ షా నిర్ణయించారు.

కర్ణాటక ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక తమ దృష్టంతా తెలంగాణపైనేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అమిత్ షా వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించి పరిస్థితులను అంచనా వేస్తారని, ఎన్నికల కోసం ప్లాన్ రచిస్తారని లక్ష్మణ్ తెలిపారు.

More Telugu News