Chennai Superkings: ఆద్యంతం ధోనీ మాయాజాలం... పంజాబ్ కు ఓటమి అవమానం!

  • కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో ధోనీ చతురత
  • బ్యాట్స్ మన్లను పక్కనబెట్టి బౌలర్లను పంపిన వైనం
  • మ్యాచ్ ఓటమితో ప్లే ఆఫ్ కు దూరమైన పంజాబ్

లీగ్ దశను దాటి ప్లే ఆఫ్ కు చేరాలంటే చెన్నై జట్టుపై ఏం చేయాలో పంజాబ్ జట్టుకు తెలుసు. ఎందుకంటే చెన్నై, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరుది కాబట్టి. గణాంకాలన్నీ కళ్లముందున్నా ఆ జట్టు ఓటమిపాలైంది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభదశలో జోరు చూపించి, ఆపై వరుస ఓటములతో కుంగిపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడుతుందని భావించిన సగటు క్రీడాభిమానికి నిరాశను కలిగించింది. భారీ స్కోరు సాధించాల్సిన జట్టు, కేవలం 153 పరుగులకు పరిమితం అయింది. ఆపై కూడా కనీసం 53 పరుగుల తేడాతో చెన్నైపై గెలిస్తే ప్లే ఆఫ్ కు చేరుతుంది.

ఇక ఆఖరి లీగ్ మ్యాచ్ లోనూ విజయంతో ప్లే ఆఫ్ కు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న ధోనీ జట్టు, 154 పరుగుల కష్టసాధ్యం కాని విజయలక్ష్యంతో బరిలోకి దిగగా, ఆద్యంతం ధోనీ తన మాయాజాలాన్ని చూపించాడు. ఈ సీజన్ లో చక్కగా రాణిస్తున్న అంబటి రాయుడిని కేవలం ఒక్క పరుగుకు, ఆపై డుప్లెసిస్ ను 14 పరుగులకు, బిల్లింగ్స్ ను డక్కౌట్ గానూ ఔట్ చేసి ఓ దశలో పంజాబ్ జట్టు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా? అని అనిపించింది.

ఆ సమయంలోనే ధోనీ తన చతురతను బయటకు తీశాడు. బ్యాట్స్ మన్లను పంపకుండా, బౌలర్లయిన హర్భజన్ సింగ్, దీపక్ చాహర్ లను పంపి సంచలన ఎత్తుగడ వేశాడు. వీరిద్దరూ వచ్చి, షాట్లకు పోకుండా నెమ్మదిగా మ్యాచ్ ని పంజాబ్ కు దూరం చేశారు. హర్బజన్ 19, దీపక్ 39 పరుగులు చేశారు. మరో ఎండ్ లో నిలకడగా రైనా ఉండగా, జట్టు స్కోరు 100 దాటింది. చెన్నై చేసిన పరుగులు 100 దాటగానే పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి. ఆపై ఆ జట్టు బౌలర్లు కూడా పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. రైనా 61 నాటౌట్, ధోనీ 16 నాటౌట్ తో జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఇక రేపటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరగనుండగా, తొలి మ్యాచ్ టాప్-2 స్థానాల్లో ఉన్న హైదరాబాద్ సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య (క్వాలిఫయర్ మ్యాచ్) జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఆ తరువాత బుధవారం నాడు కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య (ఎలిమినేటర్ మ్యాచ్) జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టుతో క్వాలిఫయర్ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు గురువారం నాడు తలపడుతుంది. గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుందన్న సంగతి తెలిసిందే.

More Telugu News