Pawan Kalyan: ‘సీఎం..సీఎం’ అని అరిస్తే కాదు.. మీరు ఓట్లేస్తే నేను సీఎం అవుతా!: పవన్ కల్యాణ్

  • ముఖ్యమంత్రి కావడమనేది సహజంగా జరగాలి
  • నన్ను ముఖ్యమంత్రిగా చూడాలంటే నాకు అండగా ఉండండి
  • ఓట్లను డబ్బుతో కొనే వ్యవస్థకు చరమాంకం పలకాలి
  • ఒక్క అవకాశమిప్పించమని ఆ దేవుడిని కోరుకుంటున్నా

‘సీఎం.. సీఎం’ అని అరిస్తే కాదు.. తనకు ఓట్లు వేస్తే సీఎంను అవుతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇచ్ఛాపురం బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో ‘సీఎం..సీఎం‘ అనే నినాదాలు మిన్నంటాయి. దీంతో, ఈ విషయమై పవన్ మాట్లాడుతూ, ‘చెప్పాను కదా! మీరు సీఎం..సీఎం అని అరిస్తే నేను అవను. ఓట్లు వేస్తే సీఎం అవుతా. ఓటర్ కార్డు తీసుకుని మీరు ఓట్లు వేస్తే నేను సీఎంను అవుతా. మీ అమ్మానాన్నగార్ల చేత మీరు ఓట్లు వేయిస్తే నేను సీఎం అవుతా.

మీ ఇంట్లో ఒకటే చెప్పండి.. ‘మీకు దోపిడీ చేసే ప్రభుత్వం.. అవినీతితో నిండిపోయిన ప్రభుత్వాలు కావాలంటే ఆ పార్టీల వద్దకు వెళ్లమని చెప్పండి. నిజాయతీగా ఏమీ ఆశించకుండా ఉండే ముఖ్యమంత్రి, ప్రభుత్వం కావాలంటే మాత్రం ‘జనసేన’, పవన్ కల్యాణ్ ని ఎంచుకోమని చెప్పిండి. నేను ముఖ్యమంత్రి అనే పదం గురించి ఎందుకు మాట్లాడనంటే.. ముఖ్యమంత్రి కావడమనేది సహజంగా జరగాలి.

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే, నన్ను ముఖ్యమంత్రిగా చూడాలంటే మీరు నాకు అండగా ఉండండి. ఓట్లను డబ్బుతో కొనే వ్యవస్థకు చరమాంకం పలకాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకని, మీ అందరి ఆశీస్సులతో సరికొత్త రాజకీయ వ్యవస్థను 2019లో జనసేన పార్టీ కచ్చితంగా స్థాపిస్తుంది. ప్రజలు కోరుకున్న ప్రజాప్రభుత్వం వస్తుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. ఆ దేవుడి దయవల్ల..గంగమ్మతల్లి దయవల్ల శ్రీకాకుళం ప్రజల కష్టాలు తీర్చేందుకు జనసేన పార్టీకి ఒక అవకాశం ఇప్పించమని కోరుకుంటున్నా’ అని అన్నారు.

More Telugu News