Jet Airways: నో ఫ్లయ్ లిస్టులో తొలి వ్యక్తి... ముంబై ఆభరణాల వ్యాపారిని బ్యాన్ చేసిన జెట్ ఎయిర్ వేస్!

  • విమానం టాయిలెట్ లో హైజాక్ మెసేజ్
  • అహ్మదాబాద్ లో అత్యవసరంగా దిగిన జెట్ విమానం
  • విచారణ తరువాత నో ఫ్లయ్ లిస్టులో తొలి వ్యక్తి చేరిక!

విమాన సేవలకు ఆటంకం కలిగించడం, సిబ్బందిపై దురుసు ప్రవర్తన ఘటనలు పెరిగిపోవడంతో నిబంధనలు మీరే వారు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలన్న నిర్ణయంతో ఎన్ఎఫ్ఎల్ (నో ఫ్లయ్ లిస్ట్)ను తీసుకువచ్చిన 8 నెలల తరువాత, ఓ వ్యక్తి పేరు ఆ జాబితాలో చేరింది. తమ విమానం టాయిలెట్ లో హైజాక్ చేస్తున్నట్టు మెసేజ్ పెట్టిన ముంబై ఆభరణాల వ్యాపారి బిర్జు కిషోర్ సల్లాపై ఐదేళ్ల నిషేధం విధిస్తున్నట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది.

గత సంవత్సరం అక్టోబర్ 30న ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్ విమానం, సల్లా చేసిన పనితో అహ్మదాబాద్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 1ఏ సీటులో కూర్చున్న ఆయన, టాయిలెట్ లో "విమానంలో హైజాకర్లు ఉన్నారు. ఇది ల్యాండ్ కాదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వెళుతుంది. ల్యాండింగ్ చేయాలని చూస్తే పేలిపోతుంది. కార్గోలో పేలుడు పదార్దాలు ఉన్నాయి. ఢిల్లీలో విమానాన్ని దించితే పేల్చేస్తాం" అని రాసున్న కాగితం పెట్టాడు. ఈ ఘటన తరువాత విచారణ జరిపిన డీజీసీఏ, జెట్ ఎయిర్ వేస్, సల్లా లెవల్ 3 తప్పు చేసినట్టు నిర్ధారించాయి. విమానాల్లో లెవల్ 3 తప్పిదమంటే అత్యధిక తప్పు చేసినట్టు.

More Telugu News