Vizag: కోరిక తీర్చలేదని విద్యార్థిని జవాబు పత్రాలను మార్చేసిన ప్రిన్సిపాల్!

  • విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
  • మాట వినలేదని గణితం జవాబు పత్రాలను మార్చిన వైనం
  • దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. తన కోరిక తీర్చాలని విద్యార్థినిపై ఒత్తిడి తెచ్చి, విఫలమై, ఆ ఆగ్రహంతో ఆమె భవిష్యత్తును నాశనం చేయాలని చూశాడు. విశాఖ జిల్లా ముంచంగిపుట్టులోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ నాగసాయి సత్యమూర్తి బాగోతం ఇది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఇంటర్ సెకండియర్ చదువుతున్న బాలికపై కన్నేసిన సత్యమూర్తి, ఆమెను పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరిస్తుండేవాడు. ఆమె ఎంతకూ లొంగకపోవడంతో ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. ఈ సంవత్సరం మార్చిలో ఆమె ఇంటర్ మ్యాథ్స్ పరీక్ష రాయగా, కేవలం 2 మార్కులు మాత్రమే వచ్చాయి. రీ వెరిఫికేషన్ చేయించినా అవే మార్కులు వచ్చాయి. ఆపై అనుమానంతో మీ సేవ ద్వారా జవాబు పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకుని చూడగా, ఓ ఎమ్మార్ షీటు మార్చిదే వుండగా, జవాబుపత్రం మాత్రం గత సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష తేదీతో ఉంది. దీంతో ప్రిన్సిపాల్ ఈ పని చేసుంటాడని భావించి, విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ప్రిన్సిపాల్ ను అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.

More Telugu News