Karnataka: యడ్యూరప్పను మరో మారు జైలుకు నెట్టే ఆలోచనలో కాంగ్రెస్!

  • ఆడియో టేపుల ఉచ్చులో యడ్యూరప్ప
  • స్వయంగా ప్రలోభాలు పెట్టిన యడ్డీ
  • టేపుల ఫోరెన్సిక్ రిపోర్టు తరువాత జైలుకే!

గతంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో జైలుకు వెళ్లిన బీజేపీ నేత యడ్యూరప్ప, ఇప్పుడు మరోమారు జైలుకెళ్లక తప్పదా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. యడ్యూరప్ప ఇప్పుడు ఆడియో టేపుల ఉచ్చులో చిక్కుకున్నారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విశ్వాస పరీక్షను ఎదుర్కొనే ముందు, యడ్యూరప్ప స్వయంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి, వారిని ప్రలోభాలకు గురి చేయాలని చూడటం, వాటికి సంబంధించిన ఆడియోలను కాంగ్రెస్ బయట పెట్టిన విషయం తెలిసినవే.

యడ్యూరప్ప, శ్రీరాములు, మురళీధర్ రావు, గాలి జనార్దన్ రెడ్డి తదితరులు కోట్ల కొద్దీ డబ్బు, మంత్రి పదవులు ఇస్తామంటూ మాట్లాడిన ఆడియోలను కాంగ్రెస్ బహిర్గతం చేసింది. ఇంకా కాంగ్రెస్, జేడీఎస్ వద్ద బీజేపీ నేతలకు చెందిన ఆడియో క్లిప్ లు ఉన్నట్టు తెలుస్తోంది. ఆడియో లీకులతో బీజేపీ బండారం బట్టబయలుకాగా, దీనిపై రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే పోలీసు కేసు పెట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మెల్యేల సెల్ ఫోన్లలో రికార్డు అయిన సంభాషణలను ఫోరెన్సిక్ రిపోర్టు కోసం పంపించి, ఆపై మాట్లాడింది యడ్యూరప్పేనని నిర్దారించి, ఆయనతో పాటు ఇతర బీజేపీ నేతలను విచారించాలని కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News