ఉన్నది ఒకటే ప్లేస్... పోటీలో రాజస్థాన్, ముంబై, పంజాబ్... ఎవరికి అవకాశం?

  • విశేషంగా అలరించిన ఐపీఎల్ 2018
  • నేటితో లీగ్ దశ మ్యాచ్ లు పూర్తి
  • ఒక్క స్థానం కోసం పోటీ పడుతున్న మూడు జట్లు

దాదాపు నెల రోజులకు పైగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించిన ఈ సీజన్ ఐపీఎల్ పోటీలు తుది దశకు వచ్చాయి. మొత్తం 8 జట్లు పోటీ పడ్డ ఈ పోరులో నాలుగు జట్లకు ప్లే ఆఫ్ చాన్స్ ఉండగా, హైదరాబాద్, చెన్నై, కోల్ కతా జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకున్నాయి. ఇక నాలుగో స్థానం కోసం రాజస్థాన్, ముంబై, పంజాబ్ జట్లు పోటీపడుతున్నాయి. బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు ఇంటి బాట పట్టాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 పాయింట్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, మరో రెండు మ్యాచ్ లు మిగిలివుండటంతో, ఈ మ్యాచ్ ల ఫలితాలపై రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలున్నాయి. ఒక్క స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి ఎంత చాన్స్ ఉందంటే...

రాజస్థాన్ రాయల్స్: చేతిలో మరే మ్యాచ్ లేదు. నేడు ముంబై, ఢిల్లీ మధ్య జరిగే మ్యాచ్ లో ముంబై జట్టు ఓడిపోవాలి. చెన్నై, పంజాబ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవాలి. అప్పుడే రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ కు వెళుతుంది. ఒకవేళ ముంబై ఓడిపోయి, పంజాబ్ గెలిచినా, మెరుగైన రన్ రేటు కారణంగా రాజస్థాన్ ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలున్నాయి.

ముంబై ఇండియన్స్: పోటీలో ఉన్న మిగతా జట్లతో పోలిస్తే మెరుగైన రన్ రేటును కలిగున్న ముంబై జట్టు, నేడు ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే, ప్లే ఆఫ్ కు వెళుతుంది. అయితే ఇక్కడో చిన్న కిరికిరి ఉంది. చెన్నైపై పంజాబ్ ఓ భారీ విజయాన్ని, అంటే... తొలుత బ్యాటింగ్ చేస్తే, ఓ 100 పరుగుల తేడాతో, తొలుత ఫీల్డింగ్ చేస్తే, ఆరేడు ఓవర్లలో 150కి పైగా పరుగులను సాధిస్తే, పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ కు వెళుతుంది. ఇది దాదాపు అసాధ్యమే.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: చెన్నై సూపర్ కింగ్స్ పై నేడు భారీ విజయాన్ని నమోదు చేయాలి. ఆపై ఢిల్లీ చేతిలో ముంబై జట్టు ఓడిపోవాలి. అప్పుడే పంజాబ్ కు ప్లే ఆఫ్ చాన్స్ ఉంటుంది. అయితే, నేడు పంజాబ్ చిట్ట చివరి మ్యాచ్ ఆడనుండటంతో, ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఏం చేయాలన్న విషయమై గణాంకాలు కళ్లముందుండటం పంజాబ్ కు ప్లస్ పాయింట్.

More Telugu News