పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయి.. జాగ్రత్త!: 'మహానాడు' నిర్వహణ కమిటీ సభ్యులతో చంద్రబాబు

19-05-2018 Sat 06:51
  • కొన్ని ఘటనలను అడ్డం పెట్టుకుని విధ్వంసానికి కుట్ర
  • ప్రజల నుంచి ప్రభుత్వాన్ని దూరం చేసేందుకు ప్లాన్
  • రాత్రికి రాత్రే 3 వేల మంది, 87 వాహనాలు ఎలా వచ్చాయ్?

ఈ నెలాఖరులో విజయవాడలో జరగనున్న మహానాడు నిర్వహణ కోసం ఏర్పాటైన పదహారు కమిటీల సభ్యులతో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంపై పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గుంటూరులో ఇటీవల పనికట్టుకుని విధ్వంసం సృష్టించారని, చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని అడ్డంపెట్టుకుని విధ్వంసానికి కుట్ర చేశారని అన్నారు. తాజాగా రమణ దీక్షితులను అడ్డం పెట్టుకుని మరోమారు బురద జల్లే ప్రయత్నం జరిగిందన్నారు. ఇవే కావని, మరో పది కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని, తద్వారా ప్రజల నుంచి ప్రభుత్వాన్ని దూరం చేయాలని అనుకుంటున్నారని అన్నారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.

గుంటూరు విధ్వంసం పక్కా ప్లాన్‌తో జరిగిందని పోలీసులు కూడా చెబుతున్నారని, లేకపోతే 3 వేల మంది జనం, 87 వాహనాలు రాత్రికి రాత్రే ఎలా వస్తాయని ప్రశ్నించారు. మహానాడుపై ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయని, మహానాడు వేదికగా ప్రజలకు చిత్తశుద్ధితో మనందరం పునరంకితం అవుదామని చంద్రబాబు అన్నారు.