RAHUL GANDHI: దేవెగౌడకు కాల్ చేసి క్షమాపణలు కోరిన రాహుల్ గాంధీ!

  • ఎన్నికల ముందు ప్రచారంలో జేడీఎస్ పై కాంగ్రెస్ మాటల దాడి
  • కలసి పనిచేయనున్నందున క్షమించాలని కోరిన రాహుల్
  • 2019లోనూ కలసికట్టుగా పోరాటం చేయాలని అంగీకారం

జేడీఎస్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడకు 85వ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. అటు ప్రధాని మోదీ సైతం కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పిన విషయం విదితమే. అయితే, రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు దేవెగౌడను క్షమించాలని వేడుకున్నారు. ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా జేడీఎస్ పార్టీపైన, దేవెగౌడపైన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడంతో అందుకు క్షమించాలని కోరారు. జేడీఎస్ ను బీజేపీ-బి టీమ్ అని, జనతాదళ్ సంఘ్ పరివార్ అని రాహుల్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆరోపించారు.

పది నిమిషాల పాటు రాహుల్, దేవెగౌడ మాట్లాడుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కర్ణాటకలోని రాజకీయ పరిస్థితి, ఎలా వ్యవహరించాలన్న దానిపైనా చర్చలు జరిగినట్టు వెల్లడించాయి. కలసి కట్టుగా కర్ణాటక అంశాలపై పోరాటం చేయాలని అంగీకారానికి వచ్చినట్టు చెప్పాయి. 2019 ఎన్నికల్లో మోదీపై పోరాడేందుకు కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా సహకారం అందించాలని దేవెగౌడను రాహుల్ కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి.

More Telugu News