Tirumala: స్వామివారి మహిమలు చెప్పాల్సిన నేను, పాలకమండలి అన్యాయాలు చెప్పాల్సిరావడం దురదృష్టం!: రమణ దీక్షితులు

  • 80 సంవత్సరాల వయసులోనూ విధులు నిర్వహిస్తున్న అర్చకులు
  • ఎవరికీ ప్రమోషన్లు, పీఎఫ్, గ్రాట్యుటీ లేవు
  • అవమానకరంగా చూస్తున్నారన్న రమణ దీక్షితులు

నిత్యమూ శ్రీ వెంకటేశ్వరుని మహిమల గురించి భక్తులకు చెబుతుండే తాను, టీటీడీ పాలక మండలి చేస్తున్న అన్యాయాల గురించి చెప్పాల్సి రావడం తన దురదృష్టమని తొలగించబడ్డ శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా దేవాదాయ శాఖ కింద ఉన్న అర్చకులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పీఎఫ్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలేవీ లేవని, వేలాది మంది అర్చకులు 80 సంవత్సరాల వయసులోనూ విధులు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అసలు అర్చకులకు పదవీ విరమణ నిబంధన పెట్టాలన్న ఆలోచనే దుర్మార్గమని విమర్శించారు.

తిరుమలలో స్వామివారి కైంకర్యాలను త్వరత్వరగా ముగించాలని తమపై ఒత్తిడి తెచ్చారని, అవమానకరంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు. స్వామివారికి సమయానికి నైవేద్యం కూడా పెట్టనిచ్చేవారు కాదని, ఇన్ని రోజులూ ఓర్చుకున్న తాము, టీటీడీ వేధింపులు, అవమానాలను భరించలేకనే మీడియా ముందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.

స్వామిని భక్తులే కాపాడుకోవాలని తాను విజ్ఞప్తి చేయడం వల్లే, కక్షగట్టి 65 సంవత్సరాల నిబంధనను అకస్మాత్తుగా తెరపైకి తెచ్చి తనను, తనతోపాటు మరో ముగ్గురు సీనియర్ అర్చకులను రిటైర్ చేయించిందని ఆయన ఆరోపించారు. తమకు జరుగుతున్న అన్యాయంపై చట్టపరమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.
కాగా, రమణ దీక్షితులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఏపీ దేవాదాయ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన మాట్లాడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఆయన అర్చక వృత్తి నుంచి రాజకీయ దీక్ష చేసుకున్నట్టు తాము అనుమానిస్తున్నామని, ఆయన గతంలో చేసిన తప్పులపై చర్యలు తప్పవని, తిరుమల ఆధ్యాత్మికతను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఇదిలావుండగా, టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. టీటీడీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటోందని, వీటిని ఎదుర్కొంటామని ఆయన అన్నారు. స్వామి దర్శనం టికెట్లను కొంతమంది సినిమా యాక్టర్లు సైతం అమ్ముకుంటున్నారని సంచలన విమర్శలు చేశారు. 

More Telugu News