Pawan Kalyan: అదే జరిగితే రాష్ట్రం మరోమారు ముక్కలవుతుంది.. 20 నుంచి పోరాట యాత్ర : పవన్

  • ఈ నెల 20 నుంచి పోరాట యాత్ర
  • ఇచ్చాపురం నుంచి ప్రారంభం
  • రాష్ట్రంలో త్రిముఖ పోటీ
  • యాత్ర కోసం విశాఖ చేరుకున్న పవన్

అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా అందించాలన్న నినాదంతో ఈ నెల 20వ తేదీ నుంచి జనసేన ఆధ్వర్యంలో పోరాట యాత్రను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. యాత్ర మొత్తం 45 రోజులు కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉత్తరాంధ్ర జిల్లాల వారే కనిపిస్తున్నారని, ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఇంకా అక్కడ నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరోమారు ముక్కలవుతుందని, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతాయని అన్నారు. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం నుంచే తన యాత్ర ప్రారంభమవుతుందని పవన్ స్పష్టం చేశారు.

యాత్ర కోసం విశాఖపట్టణం చేరుకున్న పవన్ అంబేద్కర్ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై పోరాట యాత్ర గురించి చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తాను చేపట్టబోయేది బస్సు  యాత్ర కాదని, పోరాట యాత్ర అని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాదయాత్ర కూడా చేస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాల్లో యువత, విద్యార్థులతో కలిసి నిరసన కవాతు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇచ్చాపురంలో 20 న అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం, గంగమ్మకు పూజలు చేసి యాత్రను ప్రారంభించనున్నట్టు పవన్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని, రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఖాయమని పవన్ వివరించారు.

More Telugu News