Congress: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు పొడిచేందుకు ప్రియాంక సూచనే కీలకం!

  • సీఎం పదవిని కుమారస్వామికి ఇవ్వాలని సూచించింది ఆమే
  • అందుకు రాహుల్ సమ్మతి
  • ఫోన్ లో వ్యవహారం ఓకే చేసిన సోనియా

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్-జేడీఎస్ మధ్య పొత్తుపై ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్ కు చెందిన కుమారస్వామికి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సమ్మతించడం, ఎవరికి ఎన్ని మంత్రి పదవు ఇవ్వాలో కూడా ఖరారవడం జరిగిపోయాయి. ఇంత వేగంగా పొత్తు కుదరడం బహుశా ఇటీవలి కాలంలో ఇదేనేమో. అయితే, ఈ పొత్తుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక వాద్రా చేసిన సూచనే కీలకమని చెప్పుకోవాలి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం రాహుల్ తన తల్లి సోనియా, సోదరి ప్రియాంకలతో ఢిల్లీలోని తన నివాసంలో సమాలోచనలు జరిపారు. అధికారాన్ని బీజేపీ పరం చేయడం కంటే జేడీఎస్ కు మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించడమే మంచిదన్న యోచన వచ్చింది. సీఎం పదవిని కుమారస్వామికి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత జేడీఎస్ బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉండదని ప్రియాంక వాద్ర సూచించారు. దానికి రాహుల్ కూడా ఒప్పుకున్నారు. దీంతో సోనియాగాంధీ స్వయంగా దేవెగౌడకు ఫోన్ చేసి పొత్తుకు ఒప్పించారు. కుమారస్వామితోనూ మాట్లాడి విషయం చెప్పారు. అయితే, ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా ఉండాలన్న షరతును దేవెగౌడ చెప్పడంతో దానికి అంగీకారం కుదిరింది.

More Telugu News