West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హింస: 12 మంది మృతి, 43 మందికి గాయాలు!

  • పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస
  • 70 మంది అరెస్ట్
  • హింసపై నివేదిక కోరిన కేంద్రం

పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ పశ్చిమబెంగాల్‌లో హింస ప్రజ్వరిల్లింది. గత పంచాయతీ ఎన్నికల్లో 25 మంది మృతి చెందగా ఈసారి 12 మంది మృతి చెందారు. ముగ్గురు పోలీసులు సహా 43 మంది గాయపడ్డారు. ఎన్నికల ఘర్షణల్లో ఆరుగురు మృత్యువాత పడగా, మిగతా ఆరుగురు ఎలా మరణించారనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హింసాత్మక ఘటనలతో సంబంధం ఉన్న 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా 60 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినా హింస ప్రజ్వరిల్లడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ కేంద్రాలపై బాంబులు విసురుకున్నారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి రబీంద్రనాథ్ ఘోష్‌పై ఓ వ్యక్తి చేయి చేసుకోవడం కలకలం రేపింది.

ఘర్షణలకు కారణం అధికార టీఎంసీయేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నామినేషన్లు వేయొద్దంటూ అభ్యర్థులను తొలుత బెదిరించిందని, బేఖాతరు చేసిన వారిపై దాడులకు పాల్పడిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. రాష్ట్రంలో అభాసుపాలైన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత డి.రాజా కోరారు. కాగా, పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై నివేదిక ఇవ్వాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

  • Loading...

More Telugu News