currency notes: చిరిగిన రూ.200, రూ.2000 నోట్లు ఇప్పట్లో మార్చుకోవడం కష్టమే!

  • చట్టంలో వీటికి స్థానం కల్పించని ప్రభుత్వం
  • నిబంధనలను సవరిస్తేనే మార్పిడికి అవకాశం
  • త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న కేంద్రం
చిరిగిన, మాసిన రూ.200, రూ.2000 నోట్లు మార్చుకునే అవకాశం లేకపోవడంతో కస్టమర్ల  నుంచి బ్యాంకులకు చేరిన ఆ నోట్లు అలాగే మూలుగుతున్నాయి. ఎందుకంటే వీటి మార్పిడికి సంబంధించిన నిబంధనలను సవరించాల్సి ఉంది. కొత్త సిరీస్ నోట్లను మార్చుకునేందుకు ప్రస్తుతానికైతే అవకాశం లేదని ఆర్ బీఐ బ్యాంకులకు తేల్చి చెప్పింది కూడా. ఆర్ బీఐ చట్టంలోని సెక్షన్ 28 అన్నది రూ.5, రూ.10, రూ.50, రూ.100, రూ.500, రూ.1,000, రూ.5000, రూ.10,000 డినామినేషన్ (వ్యాల్యూ)  నోట్ల మార్పిడి గురించి మాత్రమే పేర్కొంది. ఇందులో రూ.200, రూ.2,000 నోట్లను చేర్చలేదు.

2016 నవంబర్ 8న డీమోనిటైజేషన్ తర్వాత కేంద్రం రూ.2,000, రూ.200 నోట్లను ప్రవేశపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. చలామణిలో 6.70 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయి. కొత్త డీనామినేషన్ నోట్లు చిరిగిన ఘటనలు ఉన్నాయని, చట్టాన్ని వెంటనే సవరించకపోతే ఇదో సమస్యగా మారుతుందని బ్యాంకర్లు అంటున్నారు. చట్టాన్ని సవరించే విషయమై ఆర్ బీఐ కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసింది. అయితే, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
currency notes

More Telugu News