Andhra Pradesh: తీసుకున్న భూములను వెనక్కు ఇచ్చేయాలన్న ఏపీ సర్కారు... చంద్రబాబు వద్దకు అనిల్ అంబానీ!

  • ప్రాజెక్టుల కోసం భూములు పొందిన అడాగ్ గ్రూప్
  • కనిపించని పురోగతి
  • భూములను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించిన ఏపీ సర్కారు
  • ఈ మధ్యాహ్నం చంద్రబాబును కలవనున్న అనిల్ అంబానీ

ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టుల పేరిట భూములను తీసుకుని, వాటిల్లో ఎటువంటి అభివృద్ధి పనులనూ ప్రారంభించని సంస్థల నుంచి భూమిని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ, అనిల్ దీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ ఈ మధ్యాహ్నం చంద్రబాబును కలవనున్నారు. అడాగ్ గ్రూప్ నెల్లూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో పురోగతి కనిపించడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సదరు భూమిని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది.

 ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం అమరావతికి రానున్న అనిల్ అంబానీ, 3 గంటల సమయంలో సెక్రటేరియేట్ లో చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇందుకోసం అపాయింట్ మెంట్ ఫిక్స్ కాగా, తమ సంస్థ పెట్టుబడులపై ఆయన వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఎల్ఐసీ, ఎస్బీఐ తదితర కార్యాలయాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న భూమిని కూడా వెనక్కు ఇచ్చేయాలని సీఆర్డీయే నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

More Telugu News