Chittoor District: చిత్తూరు జిల్లాలో మరో సరస్వతి... ఉపాధ్యాయుడి హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడే నిందితులు!

  • ఆర్ఎంపీ వైద్యుడితో ఉపాధ్యాయుడి భార్య వివాహేతర బంధం
  • ప్రియుడి కోసం భర్తను సుమోతో ఢీకొట్టించిన భార్య
  • ఇద్దరినీ అరెస్ట్ చేసిన పలమనేరు పోలీసులు

కట్టుకున్న భర్తను అమానుషంగా హత్య చేయించిన భార్యల జాబితాలో చిత్తూరు జిల్లా బంగారుపల్లెకు చెందిన రమాదేవి కూడా చేరిపోయింది. క్షణిక సుఖం కోసం ఓ ఆర్ఎంపీ వైద్యుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమాదేవి, సమాజంలో మంచి పేరు, ఉపాధ్యాయ ఉద్యోగం ఉన్న భర్త వాసుదేవన్ ను హత్య చేయించి కటకటాల పాలు కావడమే కాకుండా, తన ఇద్దరు బిడ్డలను అనాధలను చేసింది. మరోవైపు నిక్షేపంలా ఉన్న భార్యా, ఇద్దరు పిల్లలను పరాయి స్త్రీ మోజులో పడి వదిలేసి, ఆమె కోసం హత్యకు తెగబడ్డ ఆర్ఎంపీ వైద్యుడు రమేష్ కూడా జైలు పాలయ్యాడు.

పలమనేరు డీఎస్పీ చౌడేశ్వరి వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, శనివారం నాడు రమేష్ నడుపుతున్న సుమో వాసుదేవన్ ను ఢీ కొట్టగా ఆయన అక్కడికక్కడే మరణించారు. కేసును విచారించిన పోలీసులు, ఇది రోడ్డు ప్రమాదం కాదని, కావాలనే వాహనంతో ఢీకొట్టి హత్య చేశారని, దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని తేల్చారు. కొత్తూరు గొల్లపల్లిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా వాసుదేవన్ పని చేస్తున్నారని, ఆయన భార్య రమాదేవికి, వాహనం నడిపిన రమేష్ కు చాలా కాలంగా వివాహేతర బంధం ఉందని తమ విచారణలో తేలినట్టు చౌడేశ్వరి మీడియాకు తెలిపారు.

వీరిద్దరి సంబంధం గురించి తెలుసుకున్న వాసుదేవన్ భార్యను, రమేష్ ను హెచ్చరించాడని, అయినా వారు వినలేదని, గడచిన మూడు నెలలుగా ఇద్దరినీ కలుసుకోకుండా కట్టుదిట్టం చేయడంతోనే వారు హత్యకు పథకం వేశారని, అదను చూసి బైక్ పై వెళుతున్న వాసుదేవన్ ను సుమోతో ఢీకొట్టారని, ప్రమాదంలో గాయాలపాలై పారిపోతుండగా, మరోసారి ఢీకొట్టించిన రమేష్, ఆయన ప్రాణాలు తీశాడని వెల్లడించారు. ఆపై ఇద్దరూ పారిపోయే క్రమంలో ఉండగా, పోలీసులు అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు.

More Telugu News