CBI Ex JD: 'ఇంపాజిబుల్' అన్న పదం లేనేలేదు!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

  • 'ఇంపాజిబుల్' అన్న పదంలోనే 'ఐయాం పాజిబుల్'
  • దేన్నైనా సాధించవచ్చని నమ్మే గుణం నాది
  • జేపీ మార్గం వేరు, నేను ఎంచుకున్న మార్గం వేరు
  • సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఇండియాలో ఎటువంటి మార్పునైనా సాధించవచ్చని, అయితే అందుకు కొంత సమయం పడుతుందే తప్ప 'ఇంపాజిబుల్' అన్న పదానికే ఆస్కారం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో కులం, మతం, డబ్బు అంశాల ప్రభావంపై స్పందించిన ఆయన, ఈ తరహా రాజకీయాలను మార్చి చూపించవచ్చని అభిప్రాయపడ్డారు. 'ఇంపాజిబుల్' అన్న పదంలోనే 'ఐయాం పాజిబుల్' అన్న అర్థం ఉందని అన్నారు. అందరూ అనుకుని ఆలోచనా విధానాలను మార్చుకున్న వేళ, మార్పు సాధ్యమేనని చెప్పారు.

లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మార్గం వేరని, తాను ఎంచుకున్న మార్గం వేరని, అది ఏంటన్నది 75 రోజుల తరువాతే బయట పెడతానని అన్నారు. వేమన సూచించినట్టుగా, ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, దేన్నైనా సాధించాలనుకున్నా గట్టి పట్టుదలతో చేయాలని, తన ఉద్దేశం కూడా అదేనని, తాను ఎంచుకున్న లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేయబోనని స్పష్టం చేశారు. తాను కూడా జేపీ మాదిరిగా విఫల నేతను అవుతానని చేసే కామెంట్లపై తాను స్పందించనని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

తన రాజీనామా నిర్ణయం అనుకోకుండా తీసుకున్నది కాదని, సమాజానికి ఏదైనా చేయాలన్న బలమైన కోరికతోనే ఏడేళ్ల సర్వీస్ ను వదిలేయాలని నిర్ణయించుకున్నానని, రిజైన్ చేసేందుకు ముందు కుటుంబ సభ్యులతో చర్చించానని, తన తల్లి, భార్య, అక్క, చెల్లెళ్లు, స్నేహితులు తన నిర్ణయాన్ని ఆమోదించారని చెప్పుకొచ్చారు. 'జీరో బడ్జెట్ పాలిటిక్స్' వస్తాయని నమ్మే వ్యక్తిని తానని చెప్పారు. ప్రజల్లో క్షణికానందం పోయిన రోజు అది సాధ్యమవుతుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.

More Telugu News