Bihar: బీహార్ లో అమ్మాయిలకు అవమానం... పరీక్షలు రాయడానికి వస్తే నిలబెట్టి దుస్తులు కత్తిరించారు!

  • ముజఫర్ పూర్ జిల్లాలో ఘటన
  • నర్సింగ్ ప్రవేశ పరీక్షకు వెళ్లిన వారికి అవమానం
  • నలుగురి ముందే స్లీవ్ లెస్ చేసిన అధికారులు

ఓ పోటీ పరీక్ష రాసేందుకు వెళ్లిన అమ్మాయిల దుస్తులు నిబంధనల ప్రకారం లేవంటూ, వాటిని కత్తెరలు, బ్లేడులు వాడి కత్తిరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో, న్యూస్ చానళ్లలో రావడంతో బీహార్ ప్రభుత్వం ఉలిక్కిపడి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో శనివారం నాడు నర్సింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ టెస్టును బీసీఈసీఈబీ (బీహార్ కంబైన్డ్ ఎంట్రెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్) నిర్వహించింది. ఈ పరీక్షలకు అమ్మాయిలు చేతులు పూర్తిగా కప్పి ఉండే దుస్తులు వేసుకుని హాజరుకారాదన్న నిబంధన ఉంది. స్లీవ్ లెస్ డ్రస్సులు మాత్రమే ధరించి పరీక్షకు వెళ్లాలి.

ఈ విషయంలో సరైన అవగాహన లేని చాలా మంది అమ్మాయిలు చేతులు కప్పివున్న దుస్తులు ధరించి వచ్చారు. దీంతో వారి దుస్తులను అందరిముందే అధికారులు తమ ఇష్టానుసారం కత్తిరించగా, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో విద్యా విభాగం విచారణకు ఆదేశించి, భవిష్యత్తులో ఆ సెంటర్ లో ఏ విధమైన పరీక్షలు జరిపించకుండా నిషేధాన్ని విధించింది. ఈ పరీక్షకు సూపరింటెండెంట్ గా పనిచేసిన అధికారిని జీవితకాలం పాటు మరోసారి పరీక్షలకు ఇన్ చార్జ్ గా వేయకుండా నిషేధించినట్టు జిల్లా విద్యాధికారి లలన్ ప్రసాద్ సింగ్ వెల్లడించారు.

More Telugu News