nepal: రద్దయిన భారత కరెన్సీ నోట్లు మా వద్ద ఉన్నాయ్... మార్చుకునే అవకాశం ఇవ్వండంటూ కోరిన నేపాల్ ప్రధాని

  • నేపాల్ బ్యాంకుల్లో, ప్రజల వద్ద రూ.500, రూ.1,000 నోట్లు
  • నేపాల్ రాష్ట్ర బ్యాంకు వద్ద 3.36 కోట్ల నోట్లు
  • భారత్ లో పనిచేసే వారి నుంచి నేపాల్ కు పెద్ద నోట్లు

2016 నవంబర్ లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసి వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు కేంద్రం అదే ఏడాది డిసెంబర్ ఆఖరు వరకు అవకాశం ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే, పొరుగు దేశం నేపాల్ బ్యాంకుల్లోను, ఆ దేశ ప్రజల వద్ద ఇప్పటికీ రద్దయిన భారత పెద్ద నోట్లు ఉన్నాయట. వాటిని మార్చుకునేందుకు వెంటనే అవకాశం ఇవ్వాలని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి తమ దేశానికి వచ్చిన భారత ప్రధాని మోదీని కోరారు.

నేపాల్ రాష్ట్ర బ్యాంకు వద్ద 3.36 కోట్ల రూ.1,000, రూ.500 నోట్లు ఉన్నాయట. వీటిని మార్చుకునే అవకాశం ఇవ్వాలని భారత ప్రధానిని కోరినట్టు నేపాల్ ప్రధాని ఓలి మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రధాని మోదీ రెండు రోజుల నేపాల్ పర్యటన నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. భారత్ లో ఉపాధి పొందుతున్న నేపాలీయులు ఇక్కడి కరెన్సీ పెద్ద నోట్లను తమ దేశానికి పంపుతూ ఉంటారు. దీంతో రద్దయిన పెద్ద నోట్లు వారి వద్ద అలాగే ఉండిపోయాయి. వీటిని మార్చుకునే అవకాశాన్ని త్వరలోనే కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోగడే ప్రకటించారు. కానీ, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 

More Telugu News