Andhra Pradesh: సెల్‌ఫోన్ మెసేజ్‌తో వణికిపోతున్న రాయలసీమ ప్రజలు.. అనుమానితులు కనిపిస్తే అంతే!

  • కర్ణాటక నుంచి పార్థీ ముఠా దిగిందంటూ వాట్సాప్ మెసేజ్‌లు
  • భయంతో అల్లాడిపోతున్న రాయలసీమ వాసులు
  • అంతా ఉత్తదేనంటున్న పోలీసులు

రాయలసీమలో గత మూడు రోజులుగా హల్‌చల్ చేస్తున్న ఓ మెసేజ్ ప్రజల కంటిమీద కునుకును దూరం చేస్తోంది. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉంటూ అపరిచితులు కనిపిస్తే తాట తీస్తున్నారు. ‘జిల్లాలోకి పార్థీ గ్యాంగ్ వచ్చింది. ఎప్పుడు ఏ ఇంట్లో చొరబడతారో తెలియదు. అడ్డొస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడతారు. జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఈ మెసేజ్‌ను పంపండి’ అని ఉన్న ఈ మెసేజ్ ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో హల్‌చల్ చేస్తోంది.

ఈ మెసేజ్‌‌తో హడలిపోతున్న ప్రజలు అపరిచితులు కనిపించిన వెంటనే అప్రమత్తమవుతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు జరగనుండడంతో పోలీసుల పహారా పెరిగిందని, దీంతో బెంగళూరు, బళ్లారి నుంచి పార్థీ గ్యాంగ్ రాయలసీమలో అడుగుపెట్టిందని పుకార్లు జోరందుకున్నాయి.

రాయదుర్గం, హిందూపురం ప్రాంతాల్లో తొలుత ఈ మెసేజ్‌లు హోరెత్తాయి. తర్వాత కర్నూలు జిల్లాలోని ఆదోని, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, కడప జిల్లాలోని ప్రొద్దుటూరులకు పాకాయి.

కరుడుగట్టిన పార్థీ గ్యాంగ్‌ రాయలసీమలో అడుగుపెట్టిందన్న పుకార్లతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి రాయదుర్గం, హిందూపురం ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా వారి ఆచూకీ ఎక్కడా లభించలేదు.

మరోవైపు చిత్తూరు ఎస్పీ రాజశేఖరబాబు కూడా పార్థీ ముఠాపై ఆరా తీశారు. అయినా, పార్థీ గ్యాంగ్‌కు సంబంధించి ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో అదంతా ఉత్తదేనని తేల్చారు. కాగా, పార్థీ గ్యాంగ్‌ వచ్చిందంటూ పుకార్లకు తెరలేపిన వ్యక్తిని కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

More Telugu News