Suryapet District: సరస్వతి పుత్రుడికి తెలంగాణ సర్కార్ చేయూత.. త్వరలో విదేశాలకు నిరుపేద విద్యార్థి

  • లండన్‌లోని ప్రసిద్ధ రాయల్ కాలేజ్ అఫ్ ఆర్ట్స్ లో సీటు
  • ఆర్థిక స్తోమత లేక బాధపడుతోన్న రంజిత్‌ కుమార్‌
  • 20 లక్షల రూపాయలు మంజూరు చేసిన సర్కారు
  • హర్షం వ్యక్తం చేసిన రంజిత్‌

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న లండన్‌లోని ప్రసిద్ధ రాయల్ కాలేజ్ అఫ్ ఆర్ట్స్ లో డిజైన్ కోర్సుకు మొట్టమొదటి సారిగా తెలంగాణకు చెందిన విద్యార్థి పీ రంజిత్ కుమార్ ఎంపికయ్యారు. అయితే, ఓ పేద దళిత కుటుంబంలో పుట్టిన ఆ విద్యార్థి ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్నాడు. తాను లండన్ వెళ్లలేననుకున్నాడు. చివరకు ఈ విషయం తెలంగాణ ఎస్సీ అభివృద్ధి శాఖా మంత్రి జగదీశ్‌ రెడ్డి చెవున పడింది.

ప్రతిభావంతులైన విద్యార్థుల విదేశీ విద్యకు గానూ రాష్ట్ర దళిత అభివృద్ధి శాఖ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద అందిస్తోన్న 20 లక్షల రూపాయలను జగదీశ్‌ రెడ్డి సదరు విద్యార్థికి మంజూరు చెయ్యడంతో అతడి కల సాకారం కాబోతుంది. సూర్యాపేట జిల్లా తేకుమట్ల గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ తనకున్న అవాంతరాలన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నిఫ్ట్ లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నాడు. తనకు అత్యంత ఇష్టమయిన డిజైన్ కోర్సులో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గానూ ప్రపంచంలోనే పేరొందిన వాటిల్లో ఒకటిగా ఉన్న లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌, డిజైన్ కళాశాలలో సీట్ సాధించాడు.

ప్రపంచం నలుమూలల నుండి ఆ కోర్సులో చేరేందుకు వందలాది మంది విద్యార్థులు పోటీ పడ్డారు. ఆ కళాశాలలో ఉన్నవి మొత్తం 30 సీట్లే. పోటీ అయితే పడ్డాడు కానీ తనకు అవకాశం రాకపోవచ్చన్న భావనలో ఉన్న విద్యార్థి రంజిత్ కు సీటు వచ్చింది. తన చదువుకి సర్కారు సాయం చేసిన సందర్భంగా రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ... తెలంగాణ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటుతానని అన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే  తన కల సాకారమవుతోందని ఆనంద బాష్పాలతో రంజిత్ కుమార్ తెలిపాడు. 

More Telugu News