Kaveti Sammaiah: టీఆర్ఎస్ పై అసంతృప్తితో... కాంగ్రెస్ లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, సాయిలీల!

  • గతంలో చక్రం తిప్పిన సమ్మయ్య దంపతులు
  • 2014 ఎన్నికల్లో ఓటమి తరువాత తగ్గిన ప్రాధాన్యం
  • కాంగ్రెస్ లో చేరేందుకు సమ్మయ్య దంపతుల నిర్ణయం!

తెలంగాణ రాష్ట్ర సమితిలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి మంచిర్యాల, కుమురం భీం జిల్లాల పరిధిలో కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర సందర్భంగా కావేటి సమ్మయ్యతో పాటు ఆయన భార్య కాగజ్ నగర్ మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ సాయిలీల కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలను సమ్మయ్య కలుసుకున్నారని, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమ్మయ్యతో ఫోన్ లో మాట్లాడి వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుంచి టికెట్ ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్టు సమాచారం.

గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన సత్తా చాటిన కావేటి సమ్మయ్య, సాయిలీల కాంగ్రెస్ లో పలు కీలక పదవులు నిర్వహించారు. ఏఐసీసీ సభ్యురాలిగా, పీసీసీ ఎగ్జిక్యూటివ్ గా సాయిలీల పనిచేశారు. ఆపై కోనేరు కోనప్ప కాంగ్రెస్ లో ఎదగడంతో, 2007లో టీఆర్ఎస్ లో చేరిన సమ్మయ్య, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో అనూహ్యంగా కోనేరు కోనప్ప చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆపై కోనప్ప టీఆర్ఎస్ లోకి ఫిరాయించి అధికార ఎమ్మెల్యేగా మారడంతో సమ్మయ్యకు ప్రాతినిధ్యం తగ్గిపోయింది. నాలుగేళ్ల పాటు వేచిచూసినా తనకు ఒక్క పదవిని కూడా ఇవ్వలేదని, రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనతోనే పార్టీ మారాలని భావిస్తున్నానని తన అనుచరులకు సమ్మయ్య చెప్పారని తెలుస్తోంది. వారితో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ పెద్దలకు సమ్మయ్య మాటిచ్చినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News