Karnataka: కన్నడనాట నేటితో ప్రచారానికి తెర!

  • మూడు రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు
  • బయటి వారంతా రాష్ట్రం వీడాల్సిందే
  • హెచ్చరించిన ఎన్నికల కమిషన్

మరో మూడు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో మైకుల మోతకు నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగియనుండగా, ఆపై బయటి నుంచి వచ్చిన వారంతా వెళ్లిపోవాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన వారు మాత్రమే ఉండాలని, ఇతర ప్రాంతాల వారుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇక ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీ (ఎస్) నేతలంతా చివరిసారిగా ఓటర్లను అభ్యర్థించేందుకు పలు బహిరంగ సభలను ఏర్పాటు చేసుకున్నారు. హుబ్లీలో రాహుల్ నేడు ర్యాలీని నిర్వహించి, ఆపై మధ్యాహ్నం తరువాత జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాదామీలో జరిగే సభలో పాల్గొంటారు. ఆపై ప్రధాన నేతలంతా రాష్ట్రాన్ని వీడనున్నారు.

కాగా, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించామని ఈసీ వెల్లడించింది. 50 వేలకు పైగా ఈవీఎంలను సిద్ధం చేశామని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది. సున్నిత ప్రాంతాలు, అతి సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, అదనపు బందోబస్తుతో గస్తీ నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.

More Telugu News