New Delhi: సినీ రంగంలో నూతన అధ్యాయం.. అందుబాటులోకి సంచార థియేటర్!

  • అరవింద్ కేజ్రీవాల్ చేతుల మీదుగా మొబైల్ థియేటర్ ప్రారంభం
  • డిమాండ్‌ను బట్టి ఆయా ప్రాంతాల్లో సినిమాల  ప్రదర్శన
  • వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకునేలా రూపకల్పన

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా చూడాలంటే బోల్డన్ని వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ వంటి మహానగరాల్లో అయితే సామాన్యుల నుంచి సినిమా దూరంగా జరుగుతోంది. అయితే, ఇకపై ఆ బాధ ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఏకంగా థియేటరే ఇంటి దగ్గరకొచ్చేస్తుంది మరి. అవును! ఇది నిజం.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతుల మీదుగా బుధవారం ఢిల్లీలో సంచార థియేటర్ ప్రారంభమైంది. పూర్తిగా డిజిటల్ థియేటర్ అయిన ఈ మొబైల్ థియేటర్ సామాన్యులకు అతి తక్కువ ఖర్చుతో వినోదాన్ని అందించనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సతీశ్ కౌశిక్, పారిశ్రామిక వేత్త సునీల్ చౌదరి కలిసి ‘పిక్చర్ టైం’ బ్రాండ్ పేరుతో ఈ థియేటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 150 నుంచి 200 మంది వరకు కూర్చుని చూసేలా దీనిని రూపొందించారు.

వర్షాలు, అగ్నిప్రమాదాలను కూడా తట్టుకోగలగడం ఈ థియేటర్ ప్రత్యేకత. అంతేకాదు.. పూర్తిగా ఏసీ. డిమాండ్‌ను బట్టి ఆయా ప్రాంతాలకు వెళ్లి సినిమాలను ప్రదర్శిస్తారు. సినిమాను బట్టి ధర రూ.30 నుంచి రూ.60 వరకు ఉండే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఇటువంటి మొబైల్ థియేటర్లు 10 అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్యను 150కి పెంచనున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News