civils: 'సివిల్స్‌ టాపర్‌ నా గురించి ఏం చెప్పాడో చూడండి'.. వీడియో పోస్ట్ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తిన రాంగోపాల్ వర్మ

  • తనకు స్ఫూర్తి రామ్‌ గోపాల్‌ వర్మ అని చెప్పిన టాపర్‌
  • పరీక్షలకు ముందు రోజు వర్మ వీడియోలు చూసేవాడినని వ్యాఖ్య
  • విద్యావ్యవస్థ గురించి చర్చించేందుకు టాపర్‌ని రమ్మన్న ఆర్జీవీ

సివిల్ ఎగ్జామ్స్‌లో 624వ ర్యాంకు సాధించిన యడవల్లి అక్షయ్ కుమార్ అనే అభ్యర్థి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ లేకపోతే తన లైఫే లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హన్మకొండకు చెందిన అక్షయ్ కుమార్‌ తాజాగా యూట్యూబ్‌ ఛానెల్ ఐ డ్రీమ్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్జీవీ గురించి తెలుసుకున్నాక తన మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందని అన్నారు.

పరీక్షలకు ముందు రోజు కూడా వర్మ వీడియోలు యూట్యూబ్‌లో పోస్ట్ అయితే వాటిని చూశాకే నిద్రపోయేవాడినని చెప్పారు. గొప్ప గొప్ప తత్వవేత్తలను వర్మ చిన్న వయస్సులోనే చదివేశారని, అంతమందిని తాను చదవలేనని, తాను వర్మను చదివితే సరిపోతుంది అనుకున్నానని చెప్పారు. సమాజంలోని క్రైమ్ ను వర్మ చూసే విధానం తనకు చాలా నచ్చిందని, ఆర్జీవీని ఒక్కసారి కలవాలని ఎంతో ఆశగా ఉందని అన్నారు.

యడవల్లి అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చూసిన రామ్ గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేశారు. తాను ఎప్పుడూ క్రిమినల్స్‌, పోకిరీలకి స్ఫూర్తిగా నిలుస్తానని అందరూ భావిస్తారని, ఈ సివిల్స్‌ టాపర్‌ ఏం చెప్పాడో ఒకసారి చూడండని అన్నారు. తాను చదువంటే భయపడే విద్యార్థినే అని, సివిల్‌ ఇంజనీరింగ్‌ రెండు సార్లు ఫెయిల్‌ అయినప్పటికి తాను గర్వపడతానని పేర్కొన్నారు.

ఒక సివిల్‌ ఇంజనీరింగ్‌ ఫెయిల్‌ అయిన వ్యక్తి (వర్మ) ఓ సివిల్స్‌ టాపర్‌కి స్ఫూర్తి కలిగించాడని వర్మ పేర్కొన్నారు. ఆ సివిల్‌ టాపర్‌ను తాను తప్పక కలుస్తానని, ఎడ్యుకేషన్‌ గురించి చర్చిద్దామని ట్వీట్‌ చేశారు.   

More Telugu News