delhi: చనిపోయిన నెమలికి జాతీయపతాకం కప్పి అంత్యక్రియలు..ఢిల్లీ పోలీసులపై విమర్శలు!

  • చనిపోయిన నెమలిని పూడ్చిపెట్టిన ఢిల్లీ పోలీసులు
  • ఈ పని చేయాల్సింది ఫారెస్ట్ శాఖంటూ విమర్శలు
  • ఫారెస్ట్ అధికారుల సమక్షంలోనే ఆ పని చేశామంటున్న పోలీసులు

ఢిల్లీ హైకోర్టు పరిసరాల్లో ఇటీవల మృతి చెందిన మన జాతీయ పక్షి నెమలికి జాతీయ పతాకం కప్పి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. దీనిపై పలు విమర్శలు తలెత్తాయి. ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గత శుక్రవారం ఢిల్లీలోని హైకోర్టు గేటు 5 వద్ద గాయాలబారిన పడ్డ ఓ నెమలి పడి ఉన్నట్టు తిలక్ మార్గ్ పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన పోలీసులు గాయపడ్డ నెమలిని తీసుకుని చాందినీ చౌక్ లోని జైన్ బర్డ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ నెమలిని పరీక్షించిన వైద్యులు.. అది అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం జౌనాపూర్ లోని ఆసుపత్రికి నెమలి మృతదేహాన్ని తీసుకెళ్లామని చెప్పారు.

చనిపోయిన నెమలికి జాతీయ పతాకం కప్పి.. చెక్క పెట్టలో అదే ప్రాంతంలో పూడ్చిపెట్టామని, ఇదంతా ఫారెస్టు అధికారుల సమక్షంలో నిర్వహించినట్టు పోలీసులు చెప్పారు. పోలీసులు ఇదంతా చెప్పినప్పటికీ విమర్శలు మాత్రం ఆగట్లేదు. ఈ విమర్శలపై సదరు పోలీసులు స్పందిస్తూ.. మన జాతీయ పక్షి నెమలికి తాము ఇవ్వాల్సిన గౌరవమే ఇచ్చామని..ఇది ప్రొటోకాల్ అని అన్నారు. ఇలాగే నెమళ్లు చనిపోయిన విషయం తమ దృష్టికి వస్తే, వాటికి కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.

కాగా, 1972 వన్య సంరక్షణ చట్టం ప్రకారం నెమలికి సంబంధించిన అన్ని విషయాలను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని, ఈవిధంగా చనిపోయిన నెమళ్లకు పోస్ట్ మార్టం, అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర అటవీ శాఖదంటూ సంబంధిత అధికారులకు వన్యప్రాణ సంరక్షణ కార్యకర్త గౌరీ మౌలేఖీ ఓ లేఖ రాశారు. అలా చనిపోయిన నెమళ్లను ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పకపోతే.. వాటి శరీరభాగాలను స్మగుల్డ్ చేసే అవకాశం ఉంటుందని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. 

More Telugu News