Jammu And Kashmir: కశ్మీరులో తమిళనాడు టూరిస్టును రాళ్లతో కొట్టి చంపిన అల్లరిమూక... సిగ్గుతో తల దించుకుంటున్నానన్న సీఎం!

  • కశ్మీర్ అందాలను చూడాలని వెళ్లిన తమిళనాడు యువకుడు
  • నర్బాల్ ప్రాంతంలో వాహనంపై రాళ్లదాడి
  • చికిత్స పొందుతూ తిరుమణి మృతి

కశ్మీర్ అందాలను చూడాలని వచ్చిన ఓ టూరిస్టు అల్లరిమూకల రాళ్లదాడిలో చనిపోయిన ఘటన శ్రీనగర్ లో జరిగింది. తమిళనాడుకు చెందిన 22 సంవత్సరాల ఆర్.తిరుమణి, కశ్మీర్ చూసేందుకు వచ్చాడు. శ్రీనగర్ శివార్లలోని నర్బాల్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై నిరసనకారులు దాడికి దిగారు. రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో తిరుమణి తలకు రాళ్లు తగిలి తీవ్రగాయాలు అయ్యాయి. ఆపై పోలీసులు సౌరాలో ఉన్న స్కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

 "ఇది హృదయ విదారక ఘటన. నా తల సిగ్గుతో చితికిపోయింది" అని మృతుడి బంధువులను పరామర్శించిన అనంతరం జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, "మనం అతిథిగా వచ్చిన ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టిం చంపాము. రాళ్లు విసిరేవాళ్లు ఇదేనా చేయాల్సింది. నిజాన్ని తెలుసుకోండి. నిరసనకారులు ఏం పద్ధతి పాటిస్తున్నారు?" అని అన్నారు. ఇదే తరహాలో జరిగిన మరో ఘటనలో ఓ యువతి గాయాల పాలుకాగా, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ఒమర్ వ్యాఖ్యానించారు.

కాగా, ఏ తప్పూ చేయని పౌరులపై నిరసనకారులు దాడికి దిగుతుండటంపై నేషనల్ కాన్ఫరెన్స్ శ్రీనగర్ లో శాంతి ర్యాలీ చేపట్టింది. పార్టీ జనరల్ సెక్రటరీ అలీ మొహమ్మద్ సాగర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి టూరిస్టు రిసెప్షన్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు.

More Telugu News