Karnataka: 'ఇదే నా ఆఖరి ఎన్నిక' అంటూ పాతపాటే పాడిన సిద్ధరామయ్య!

  • మరోసారి ఎన్నికల్లో పోటీ పడబోను
  • అధిష్ఠానం ఆదేశాల మేరకే ఈ దఫా పోటీ
  • చాముండేశ్వరిలో సిద్ధరామయ్య

ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరివని, తదుపరి ఎన్నికల్లో తాను పోటీ పడబోనని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏడు పదుల వయసులో ఉన్న ఆయన, 2023లో జరిగే ఎన్నికల్లో మరో సమర్థవంతమైన నేతకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తానని అన్నారు. కాగా, 2013 ఎన్నికల్లో సైతం సిద్ధరామయ్య ఇలాగే మాట్లాడారని, ఇప్పుడు ఇంకోసారి అదే పాతపాట పాడుతున్నారని చూపిస్తూ, కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఎన్నికల్లోనూ పోటీ పడాలని తాను భావించలేదని, అయితే, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానం తనపై వేసిందని, అందువల్లే తాను పోటీ పడాల్సి వచ్చిందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. చాముండేశ్వరి ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన ఆయన, అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ స్థానం నుంచి సిద్ధరామయ్య స్వయంగా పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

1983లో చాముండేశ్వరి నుంచి లోక్ సభకు తొలిసారిగా ఎన్నికైన ఆయన, ఆపై ఇక్కడి నుంచి 5 సార్లు విజయం సాధించి, రెండు సార్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక తన రాజకీయ ప్రస్థానం చాముండేశ్వరిలోనే మొదలైందని, తన కెరీర్ కూడా ఇక్కడి నుంచే ముగించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ పోటీ చేస్తున్నానని ఈ సందర్భంగా సిద్ధరామయ్య పేర్కొనడం గమనార్హం.

More Telugu News