KCR: ఆడియో టేపులోని గొంతు చంద్రబాబుదే... స్పష్టం చేసిన ఫోరెన్సిక్ సంస్థ? 'గో ఎహెడ్' అన్న కేసీఆర్!

  • తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు'
  • ఫోన్ కాల్స్ డేటాను చండీగఢ్ పంపించిన ఏసీబీ
  • తెలంగాణ సర్కారుకు అందిన నివేదిక
  • ఒత్తిళ్లుండవని, కేసులో ముందుకెళ్లాలని సూచించిన కేసీఆర్

దాదాపు మూడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక రాగా, నిన్న ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఆడియో టేపుల్లో వినిపిస్తున్న గొంతు ఏపీ సీఎం చంద్రబాబుదేనని ల్యాబ్ పరీక్షలు నిర్ధారించాయని తెలిపారు. నాలుగు రోజుల క్రితమే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక తెలంగాణ పోలీసులకు అందగా, కేసును కొలిక్కి తెచ్చేందుకు గత నాలుగు రోజులుగా ఏసీబీ అధికారులు కసరత్తు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్, పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని, చట్టం ముందు అందరూ సమానమేనని, కేసు విచారణలో ముందుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఈ కేసులో జూలై 28, 2015న తొలి చార్జ్ షీట్ వేసిన ఏసీబీ, ఈ నెల చివరి వారంలో మరో చార్జ్ షీట్ వేయనున్నట్టు సమాచారం. కేసీఆర్ ను కలిసిన వారిలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావు, మాజీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ తదితరులు ఉన్నారు. ఇదిలావుండగా, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందని తెలుసుకున్న కేసీఆర్, ఆదివారం నాడే గవర్నర్ నరసింహన్ ను కలిసి కేసు గురించి ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

నరసింహన్ సైతం తదుపరి చర్యలకు ఆటంకాలుండవని చెప్పినట్టు సమాచారం. ఇక కేసులో ఇప్పటికే పూర్తి స్థాయి చార్జ్ షీట్ దాఖలుకు జీఏడీ అనుమతి తీసుకున్నామని, గవర్నర్ కూడా అనుమతించడంతో రెండు వారాల్లోనే కోర్టు ముందు చార్జ్ షీట్ దాఖలు చేస్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News