Film Awards: జాతీయ అవార్డుల ప్రదానం వివాదం: స్మృతీ ఇరానీపై రాష్ట్రపతి కోవింద్ ఆగ్రహం!

  • వివాదాస్పదమైన జాతీయ చలనచిత్ర అవార్డుల బహూకరణ
  • తాను గంటపాటు మాత్రమే ఉంటానని ముందే సమాచారం ఇచ్చిన రాష్ట్రపతి
  • వివాదంలోకి తనను లాగారని కోవింద్ అసంతృప్తి
  • ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు

జాతీయ చలన చిత్ర అవార్డుల బహూకరణ కార్యక్రమం వివాదాస్పదం కావడం, దాదాపు 50 మందికి పైగా అవార్డు గ్రహీతలు కార్యక్రమాన్ని బహిష్కరించడంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వహణలో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి స్మృతీ ఇరానీ, ఆమె శాఖ పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఈ వివాదంలోకి రాష్ట్రపతి భవన్ ను లాగడం ఏంటని ప్రశ్నిస్తూ, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.

చలనచిత్ర అవార్డు విజేతల్లో 11 మందికి మాత్రమే అవార్డులను స్వయంగా ఇచ్చిన కోవింద్, ఆపై మరో కార్యక్రమానికి వెళ్లిపోగా, మిగతా అవార్డులను స్మృతీ ఇరానీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి 55 మంది విజేతలు రానేలేదు. ఆపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. తాను కేవలం గంట పాటు మాత్రమే అందుబాటులో ఉంటానని ఎప్పుడో స్మృతీ ఇరానీకి, ఆమె శాఖకూ సమాచారం ఇచ్చామని, అయినా కార్యక్రమ నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించారని తన కార్యాలయం పేరిట పంపిన లేఖలో రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. అవార్డులైనా, స్నాతకోత్సవాలైనా రాష్ట్రపతి గంటసేపే ఉంటారని, తాను పదవి చేపట్టినప్పటి నుంచీ ఇదే కొనసాగుతోందని గుర్తు చేశారు.

కాగా, ఓ కేంద్ర మంత్రి తీరును విమర్శిస్తూ రాష్ట్రపతి తప్పుబట్టడం చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక అవార్డులు తీసుకునేందుకు రాని విజేతల ఇళ్లకు నేరుగా అవార్డులు పంపుతామని సమాచార శాఖ తెలిపింది. గతంలోనూ పలు కారణాల వల్ల అవార్డులను అందుకోలేకపోయిన వారి ఇంటికే అవార్డులను పంపామని, ఇప్పుడూ అదే చేస్తామని తెలిపింది.

More Telugu News