Nani: 'మహానటి' సినిమాలో ఇంతటి గొప్ప పాత్రల్లో కనపడనుంది ఎవరో తెలుసా?: నాని

  • విడుదలకు సిద్ధమవుతోన్న 'మహానటి'
  • ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్‌
  • కేవీ రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి
  • వీడియో విడుదల చేసిన సినీనటుడు నాని

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమైన 'మహానటి' సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్‌ నటించిన విషయం తెలిసిందే. ఇక అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య, జర్నలిస్ట్ మధురవాణిగా సమంత, ఫొటోగ్రాఫర్‌ విజయ్‌అంటోనిగా విజయ్‌ దేవరకొండ నటిస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికే ఈ సినిమా బృందం బయటపెట్టింది. అంతేగాక, నటుడు మోహన్ బాబు ఎస్వీ రంగారావుగా, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ గా కనిపించనున్నారని తెలిపింది.

ఈ సినిమాలో అలనాటి దిగ్గజ దర్శకనిర్మాత ఎల్వీ ప్రసాద్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయాన్ని ఆ సినిమా వీడియో రూపంలో విడుదల చేసి, అందుకు సంబంధించిన లుక్‌ని కూడా విడుదల చేసింది. ఎల్వీ ప్రసాద్‌ పాత్రలో అవసరాల శ్రీనివాస్‌ నటిస్తున్నాడు. 'మహానటుడు ఎన్టీఆర్‌ని తెలుగు చిత్ర సీమకు అందించిన ఎల్వీ ప్రసాదే.. మహానటి సావిత్రిని పెళ్లి చేసి చూడు సినిమాతో మనకు ఆస్తిగా ఇచ్చారు. ఆమెను మిస్సమ్మగా చూపించి మన అందరి గుండెల్లో కూర్చోపెట్టారు. ఇంతటి గొప్ప పాత్ర పోషించబోతోంది ఎవరో తెలుసా? మన అవసరాల శ్రీనివాస్‌' అంటూ యంగ్‌ హీరో నాని తన వాయిస్‌ని ఈ వీడియోకి జోడించాడు. అచ్చం ఎల్వీ ప్రసాద్‌లా అవసరాల శ్రీనివాస్‌ కనపడుతున్నాడు. అలాగే మరో వీడియోలో.. అలనాటి దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో ఇప్పటి దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి నటిస్తున్నారని నాని చెబుతూ, క్రిష్‌ లుక్‌ను కూడా విడుదల చేశాడు. తన ట్విట్టర్‌ ఖాతాలో నాని ఈ వీడియోలను పోస్ట్ చేశాడు.  

కాగా, ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సినిమాలో షాలినీ పాండే, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, భాను ప్రియ, దివ్యవాణి కూడా నటిస్తున్నారు.     

  • Loading...

More Telugu News