USA: ఎన్నారై కూచిభొట్ల హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం

  • ఆడమ్ కు యావజ్జీవ శిక్ష విధించిన యూఎస్ ఫెడరల్ కోర్టు 
  • జాత్యహంకారంతోనే కూచిభొట్ల కాల్పులు జరిపాడని నిర్ధారణ
  • న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపిన కూచిభొట్ల భార్య

గత ఏడాది ఫిబ్రవరి 22న యూఎస్ లో ఎన్నారై కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ఆడమ్ డబ్ల్యూ పురింటన్ (52)కు యావజ్జీవ శిక్షను విధిస్తూ యూఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. జాత్యహంకారంతోనే శ్రీనివాస్ పై ఆడమ్ కాల్పులు జరిపి హతమార్చినట్టు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ తీర్పు ప్రకారం యాభై ఏళ్ల జైలుశిక్ష అనుభవించిన తర్వాత ఆడమ్ కు పెరోల్ లభిస్తుంది.

కాగా, అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్, అతని స్నేహితుడు అలోక్ మదసాని కెన్సస్ లోని ఓలేత్ నగరంలోని ఓ బార్ లో ఉన్న సమయంలో ఆడమ్ కాల్పులకు పాల్పడ్డాడు. తమ దేశం నుంచి వెళ్లిపోండంటూ నినాదాలు చేస్తూ వారిద్దరిపై ఆడమ్ జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పులకు పాల్పడుతున్న ఆడమ్ ను అడ్డుకునేందుకు యత్నించిన అమెరికా వాసి లాన్ గ్రిలోట్ అనే వ్యక్తికీ గాయాలయ్యాయి.

న్యాయస్థానానికి ధన్యవాదాలు

ఈ తీర్పు వెలువడిన అనంతరం కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్పుతో చనిపోయిన తన భర్త ప్రాణాలు తిరిగి రావని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కేసులో తమకు అండగా నిలబడిన ఓలేత్ పోలీసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News