actor shivaji: భారతీయ జనతా పార్టీని చిత్తుచిత్తుగా ఓడించండి: కర్ణాటకలోని తెలుగు వారికి నటుడు శివాజీ విజ్ఞప్తి

  • దక్షిణ, ఉత్తర భారతాలను విడగొట్టే ప్రయత్నం చేస్తోంది మోదీయే
  • బీజేపీ ఓడిపోతే తప్ప ఈ దేశం, దక్షిణ భారతదేశం బాగుపడవు 
  • కర్ణాటకలోని తెలుగువాళ్లెవరూ బీజేపీకి ఓటు వేయొద్దు

కర్ణాటకలోని బళ్లారిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న పర్యటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మోదీ, బీజేపీ సర్కార్ రావడం ఖాయమని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా సాధన సమితి నేత, ప్రముఖ హీరో శివాజీ స్పందిస్తూ, నిన్న మోదీ ప్రసంగం వింటుంటే తనకు చాలా బాధ వేసిందని, చాలా చిలుకపలుకలు పలికారని అన్నారు. దక్షిణ, ఉత్తర భారత దేశాలను వేరు చేయాలని కొంత మంది నాయకులు ప్రయత్నిస్తున్నారని, దక్షిణ భారత దేశానికి గొప్ప పదవులు ఇచ్చామని మోదీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవం చెప్పాలంటే దక్షిణ భారతదేశానికి అంత గొప్ప పదవులు ఏమీ ఇవ్వలేదని, అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు.


‘2014లో దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పిన నాటి నరేంద్ర మోదీ ఈయన కాదు. బళ్లారి ప్రాంతంలో అవినీతిపరులైన 8 మందికి బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఇదంతా చూస్తుంటే మాకు అర్థమైంది ఏమిటంటే .. ఈ దేశంలో నీతి అనే దానికి ఎక్కడా తావు లేదు. బళ్లారి ప్రాంతంలోని తెలుగు వాళ్ల గురించి ఒక్క మాట అయినా మోదీ మాట్లాడతారనుకున్నా! అది కూడా చేయలేదు. దక్షిణ, ఉత్తర భారతదేశాలను విడగొడుతున్నారని మోదీ అన్నారు. అలా విడగొడుతోంది మేము కాదు, సాక్షాత్తూ మోదీయే చేస్తున్నారు. 

దక్షిణ, ఉత్తర భారతదేశాలను విడగొట్టేందుకు ఆజ్యం పోస్తోంది మీరు (మోదీ).. అది మీ ఇష్టం. ఈ దేశంలో  నీతి, చట్టాలు అన్నీ చచ్చిపోయాయి! ఈ దేశంలో న్యాయం అనే దానికి, ఓటు అనే దానికి విలువ లేదు! కర్ణాటకలో ఉన్న ప్రజలు గమనించండి. భారతీయ జనతా పార్టీని చిత్తుచిత్తుగా ఓడించండి. భారతీయ జనతాపార్టీ ఓడిపోతే తప్ప ఈ దేశం బాగుపడదు..దక్షిణ భారతదేశం బాగుపడదు. కర్ణాటకలో ఉన్న తెలుగువాళ్లందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయండి .. ఆ పార్టీని ఓడించండి .. దక్షిణభారతీయుల సత్తా ఏంటో చాటండి! ఈరోజు ఏపీకి అన్యాయం జరిగింది. రేపు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఆరోజున మనందరం ఎవరికి చెప్పుకుంటాం? మనలో మనం సాయం చేసుకుందాం. దక్షిణ భారతదేశమంటే ఏంటో మోదీ గారికి తెలియాలి!’ అని శివాజీ అన్నారు.

More Telugu News