Warangal: 1300 ఏళ్ల జగదిగ్బంధం తరువాత... వరంగల్ భద్రకాళి చెరువులో బయటపడ్డ గణనాధుడు!

  • చెరువు పూడికతీత పనులు సాగిస్తుండగా వెలుగులోకి
  • ఏడో శతాబ్దానికి చెందిన విగ్రహాలు
  • జైన, బౌద్ధ తమ శైలిలో చెక్కిన శిల్పాలు

వరంగల్ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయ రాజుల కన్నా ముందు చెక్కించిన అరుదైన శిల్పం ఒకటి భద్రకాళి చెరువులో బయటపడింది. దాదాపు 1,300 ఏళ్ల నాటి వినాయకుడు, శివలింగం ప్రతిమలు తాజాగా వెలుగుచూశాయి. ఈ చెరువును వరంగల్ నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు వినియోగిస్తుంటారన్న సంగతి తెలిసిందే.

ఈ చెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో, చెరువులో పూడిక తీత పనులు చేస్తున్న వేళ, ఏడో శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాలు బయటపడ్డాయి. ఐదు అడుగుల ఎత్తులో ఉన్న బండరాయిపై వికసిత పద్మం ఆకారంలో కూర్చున్న వినాయకుడి విగ్రహం చెక్కబడి ఉండగా, దాని చుట్టూ శివలింగం, నంది, వినాయకుడు, సూర్యుడు, విష్ణుమూర్తి, మహిషాసుర మర్దిని శిల్పాలున్నాయి. వీటిని పరిశీలించిన తెలంగాణ చరిత్రకారుడు హరగోపాల్, ఇవి సాధారణ హైందవ సంస్కృతికి కొంత భిన్నంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

శివలింగం కింద ఉండాల్సిన పానవట్టం స్తూపం వేదిక తరహాలో ఉండటంతో, ఈ పద్ధతిని అనుసరించే బౌద్ధ మతస్తులు వీటిని చెక్కించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక వినాయక విగ్రహంపై జైన మత ఆనవాళ్లు ఉన్నాయి. అప్పట్లో బౌద్ధ, జైన, హైందవ మతాల మధ్య తీవ్ర పోటీ ఉండేదని గుర్తు చేస్తూ, ఎక్కడ ఎవరి ఆధిపత్యం ఉంటే, వారు తమ మతానికి అనుగుణంగా విగ్రహాలను మారుస్తుండేవారని, అది ఇష్టం లేని వారు విగ్రహాలను ఇలా చెరువులో దాచి ఉండవచ్చని అంచనా వేశారు. కాకతీయులకు పూర్వం ఈ ప్రాంతంలో జైన, బౌద్ధ మతాలు వర్థిల్లాయన్న సంగతిని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News