Yanamala: ఏపీలో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి.. డిగ్రీ పాసైన వారే అర్హులు

  • మంత్రివర్గ ఉప సంఘం భేటీలో కీలక నిర్ణయాలు
  • నెలాఖరులోగా విధివిధానాల రూపకల్పన
  • ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
  • కుటుంబంలో ఒకరికే నిరుద్యోగ భృతి

నిరుద్యోగ భృతితో ఏపీలో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ఎన్ని వందల కోట్లయినా కేటాయిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి కల్పించనున్నామన్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో తన కార్యాలయంలో నిరుద్యోగ భృతి విధివిధానాల రూపకల్పనపై ఈ రోజు జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు.

ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించేలా నిరుద్యోగ భృతి అందించాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. అవసరమైతే ఎన్ని వందల కోట్లయినా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ నెలాఖారులోగా పూర్తిస్థాయిలో విధివిధానాలను రూపొందించాలని అధికారులను యనమల ఆదేశించారు. అర్హుల వయస్సు, విద్యార్హతలపై చర్చించారు. డిగ్రీ పూర్తి చేసిన వారినే అర్హులుగా గుర్తించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో శిక్షణనిచ్చి, రాష్ట్రంలో విస్తృతంగా ఏర్పాటవుతోన్న పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రులు నిర్ణయించారు.

ఉపాధి కల్పించిన వెంటనే వారిని నిరుద్యోగ భృతి పథకం నుంచి మినహాయిస్తామని, వారి స్థానంలో కొత్త వారికి అవకాశమిస్తామని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించిందని అన్నారు. నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు మంత్రులు సూచించారు.

ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించాలని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. జిల్లా కేంద్రంగా ఒక అధికారిని నియమించి, దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదనంగా దరఖాస్తులు వస్తే, వారికి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులతో పాటు ప్రైవేటు పరిశ్రమల్లో పని చేసేవారు నిరుద్యోగ భృతి అందుకోడానికి అనర్హులుగా గుర్తిస్తామన్నారు.

డిగ్రీ తరువాత ఉన్నత విద్య అభ్యసించేవారిని కూడా అనర్హులుగా పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరికే నిరుద్యోగ భృతి అందించేలా విధి విధానాల్లో పేర్కొనాలన్నారు. విధివిధానాల రూపకల్పన పక్కాగా ఉండాలని, న్యాయ పరంగా ఇబ్బందులు తలెత్తేలా ఉండకూడదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

More Telugu News