Rains: శ్రీకాకుళం టూ చిత్తూరు... అకాలవర్షాలతో అపార నష్టం... 17 మంది మృతి!

  • ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు
  • ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు
  • ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం
  • నేడు కూడా వర్షాలకు అవకాశం

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ అన్ని ప్రాంతాలూ అకాలవర్షాలతో అల్లాడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్నంతా గడగడలాడించిన వర్షాలు నేడు నెల్లూరు, విజయనగరం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలను వదల్లేదు. ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో గాలి, వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు, ఉదయగిరి మండలాలలో పిడుగులు పడుతున్నాయి. ఉద్ధృతంగా వీస్తున్న గాలుల ధాటికి ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు కూలి విద్యుత్‌ సరఫరా నిలిచింది. పలు చోట్ల పిడుగులు పడి 16 మంది మృతి చెందగా, చెట్టు కూలి ఒకరు మరణించారు. సముద్రంలో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతు కావడంతో వారి కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో మామిడి, అరటి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు, సముద్రం ఒడ్డున ఉన్న ఉప్పు సాగు కూడా నాశనం అయ్యాయి. నూర్పిడికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి పోయింది.

రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షం బీభత్సాన్నే సృష్టించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పలు జిల్లాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు వదిలారు. చాలా చోట్ల హోర్డింగులు నేలకూలాయి. దాదాపు 1.20 లక్షల బస్తాల ధాన్యం, 50వేల బస్తాలకు పైగా మొక్కజొన్న వర్షపు నీటిలో తడిసిపోయింది. వేలాది ఎకరాల్లో అరటి తోటలు నేలమట్టమయ్యాయి.

ఉదయం నుంచి మొదలైన వర్షాలు దాదాపు రాత్రి వరకూ కురిశాయి. చాలా ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలను, వాటి కారణంగా కలిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించారు. పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఈదురుగాలులతో వర్షం కురవగా, అసెంబ్లీలోని విపక్ష నేత వైఎస్ జగన్ చాంబర్ లోకి వర్షపు నీరు పోటెత్తింది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం, రెంటచింతల తదితర మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటలకే చీకట్లు అలముకున్నాయి. గుంటూరు, విజయవాడ నగరాల్లో హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకూలడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సుమారు 1000 ఎకరాల్లో బొప్పాయి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగింది. ప్రజలు సురక్షిత చర్యలు తీసుకోవాలని, నేడు, రేపు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News