NTR: ఎన్టీఆర్ పాత్రలో నేను నటించడమా?.. అది ఈ జన్మలో జరగదు : తెగేసి చెప్పిన ఎన్టీఆర్

  • స్వప్న వచ్చి ఎన్టీఆర్ పాత్రను చేయాలని అడిగింది
  • అంత దమ్ము తనకు లేదని చెప్పేశా
  • మహానటి ఆడియో ఫంక్షన్‌లో ఎన్టీఆర్

తాతగారి పాత్రను చేయడం ఈ జన్మలో జరగని పని అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తేల్చి చెప్పాడు. అది నటిస్తే జరగదని, జీవిస్తేనే ఆ పాత్రకు న్యాయం చేయగలమని పేర్కొన్నాడు. ఒక వ్యక్తిగా నటించడం చాలా కష్టమైన పని అని, అది తన వల్ల కాదని అన్నాడు. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నిర్మాత స్వప్న ఓ రోజు తన వద్దకు వచ్చి మహానటి సినిమాలో గెస్ట్ రోల్‌గా తాతగారి వేషాన్ని వేయాలని కోరిందని తెలిపాడు. అయితే, తాను వేయలేనని చెప్పేశానన్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని, ఆయన వేషం వేసే అర్హత తనకు లేదని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఆయన పాత్ర పోషించడం ఈ జన్మలో జరిగే పనికాదన్నాడు. తాతగారి పాత్రను పోషించే దమ్ము తనకు లేదన్నాడు. ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించిన దుల్కర్, కీర్తి, సమంత, విజయ్‌లకు హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నాడు. చాలెంజింగ్‌గా తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నట్టు చెప్పాడు. ఇక సీతారామశాస్త్రి గురించి మాట్లాడే అర్హత, అనుభవం తనకు లేవని ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

More Telugu News