asthma: ఊపిరి తీస్తున్న కాలుష్యం... రెండు కోట్ల మంది భారతీయులకు ఆస్తమా సమస్య

  • నేడు ప్రపంచ ఆస్తమా దినం
  • దేశంలో ఏటేటా పెరిగిపోతున్న బాధితులు
  • చిన్నారుల్లో 15 శాతం మందికి సమస్య

దేశ ప్రజలను కాలుష్యం కబళిస్తోంది. సుమారు రెండు కోట్ల మంది ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారు. 5-11 ఏళ్ల మధ్య చిన్నారుల్లో 10 నుంచి 15 శాతం మందికి ఈ సమస్య ఉంది. దేశ ప్రజల్లో 25 శాతం మంది అలర్జీ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇందులో 5 శాతం మందికి ఆస్తమా ఉంది. ఇది మన ఒక్కరి సమస్యే కాదు. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ ఏటా ఆస్తమా వ్యాధి బాధితులు పది శాతం మేర పెరిగిపోతున్నారు. వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి సాధించినా, ఆస్తమాకు తగిన కారణాన్ని నేటికీ గుర్తించలేకపోయినట్టు  ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగానే కాకుండా ఆస్తమా దినంగానూ జరుపుకుంటున్నారు.

ఆస్తమా గురించి కొన్ని విషయాలు

  • ఇది అంటువ్యాధి కాదు. ఊపిరితిత్తుల్లో శ్వాస నాళాలకు సంబంధించిన సమస్య ఇది. ఇవి వాచిపోవడంతో శ్వాస నాళాల్లో వాయువు ప్రసారానికి అడ్డంకులు ఎదురవుతాయి.
  • ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బాధితులు 23 కోట్ల మంది ఉన్నారు.
  • 2015లో ఆస్తమా కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3,83,000 మంది మరణించారు.
  • అలెర్జీ కారకాలను పీల్చినప్పుడు వచ్చే సమస్య ఇది. ఇంట్లో ఉండే డస్ట్ మైట్స్ ముఖ్యంగా కార్పెట్లు, పరుపు, దిండ్లలో ఉండే పురుగులు, బయట ఉండే వాయు కాలుష్యాలు, సిగరెట్ల పొగ, రసాయనాల వల్ల ఆస్తమా వస్తుంది.
  • నివారణ చర్యలు, వైద్య చికిత్సలతో ఆస్తమా బారిన పడిన వారు కూడా హాయిగా జీవించడం సాధ్యమే.

More Telugu News