Karnataka: తన వాళ్లకు టికెట్లు ఇప్పించుకున్నారు గానీ... మోదీ బళ్లారికి వస్తున్నా గాలికి అందని ఆహ్వానం!

  • దాదాపు 10 మంది గాలి అనుచరులకు టికెట్లు
  • కానీ ప్రచారానికి మాత్రం గాలి జనార్దన్ రెడ్డి దూరం
  • ఆయన వస్తే బీజేపీకి నష్టమని భావన

కర్ణాటక మైనింగ్ రాజు గాలి జనార్దన్ రెడ్డి, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రధాన అనుచరులకు, బంధుగణానికి టికెట్లు ఇప్పించుకున్నారే గానీ, అధికారిక ప్రచార కార్యక్రమానికి మాత్రం దూరమయ్యారు. ఆయన్ను ప్రచారానికి వెళ్లవద్దని, మీడియాకు కూడా కనిపించరాదని బీజేపీ పెద్దలు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇటీవల శ్రీరాములు తరఫున ప్రచారం నిర్వహిస్తూ, సిద్ధరామయ్యను రావణుడిగా పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీకి నష్టం కలిగించాయన్న భావనతో ఉన్న ఆ పార్టీ నేతలు, గాలిని ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఈ నెల 3వ తేదీన బళ్లారిలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాలి జనార్దన్ రెడ్డికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో నడిచిన ఇనుప గనుల కుంభకోణం, ఆపై గాలిపై వచ్చిన అక్రమాస్తుల కేసు బీజేపీకి ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బళ్లారి ప్రాంతంలో ఆయనకు ఉన్న పట్టు, అంగ అర్ధబలాలను వదులుకోవడం ఇష్టంలేని బీజేపీ ఆయన వర్గానికి పెద్దపీట వేస్తూ, దాదాపు 10 నియోజకవర్గాల్లో ఆయన సూచించిన వారికి టికెట్లు ఇచ్చినప్పటికీ, వివాదాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే బీజేపీ గాలిని దూరం పెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News