Smartphones: ఫేస్ బుక్ కు షాక్.. రాజీనామా చేసిన వాట్స్ యాప్ సీఈఓ!

  • కోట్లాది స్మార్ట్ ఫోన్లలో వాట్స్ యాప్
  • రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన జాన్ కౌమ్
  • ఫేస్ బుక్ బోర్డుకు కూడా

ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో మెసింజర్ సేవలందిస్తూ కోట్లాది మంది స్మార్ట్ ఫోన్లలో ఉన్న వాట్సా యాప్ సీఈఓ జాన్ కౌమ్ తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి మాతృసంస్థ ఫేస్ బుక్ కు షాకిచ్చారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన ఫేస్ బుక్ బోర్డు డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామాకు గల కారణాలను ఆయన వెల్లడించనప్పటికీ, ఫేస్ బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్టు వచ్చిన వార్తలు, ఆపై జరిగిన పరిణామాల నేపథ్యంలోనే జాన్ కౌమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇక వాట్స్ యాప్ భవిష్యత్ కార్యాచరణపైనా జాన్ నిర్ణయాలను ఫేస్ బుక్ వ్యతిరేకించిందని తెలుస్తుండగా,, వాట్స్ యాప్ యూజర్ల సమాచారం కూడా బయటకు వెళుతోందని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన రాజీనామా కలకలం రేపుతోంది. బ్రెయిన్ తో కలసి తాను వాట్స్ యాప్ ను మొదలుపెట్టి పదేళ్లు దాటిందని, ఈ ప్రయాణం ఎంతో అద్భుతమని, ఇదే సమయంలో తాను బయటకు వచ్చే సమయం కూడా ఆసన్నమైందని తన సోషల్ మీడియా ఖాతాల్లో జాన్ కౌమ్ వ్యాఖ్యానించారు. వాట్స్ యాప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్ గత సంవత్సరం సంస్థను వీడిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా, దాదాపు 5 వేల మంది యాప్ సాఫ్ట్ వేర్ డెవలపర్లు, వాట్స్ యాప్ వాడకందారులతో జుకర్ బర్గ్ సమావేశమైన వేళ, కౌమ్ రాజీనామా విషయం ఆయనకు తెలిసింది. ఆపై సమాధానం ఇచ్చిన జుకర్ బర్గ్ మీతో కలసి పనిచేయడాన్ని మిస్ అవుతున్నానని వ్యాఖ్యానించినట్టు సమాచారం.

More Telugu News