Guntur District: గుంటూరు జిల్లాలో విషాదం... పెళ్లింట మైకులో పాట పాడుతుండగా.. కరెంట్ షాక్ తో యువతి మృతి!

  • మాచర్ల సమీపంలో ప్రమాదం
  • బంధువుల ఇంటికి వివాహం నిమిత్తం వచ్చిన సునీత
  • నలుగు పాట పాడుతూ కరెంట్ షాక్ తో మృతి
గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి జరుగుతున్న ఇంట్లో పాట పాడుతున్న యువతికి మైకు నుంచి కరెంట్ షాక్ కొట్టి మరణించింది. ఈ ఘటన మాచర్ల మండలం రేగులవరం తండాలో జరిగింది. గ్రామానికి చెందిన సాయి వివాహం 2వ తేదీన జరగనున్న నేపథ్యంలో పెళ్లికి ముందు నలుగు పెట్టే తతంగానికి ఆమె దగ్గరి బంధువైన సునీత వచ్చింది.

ముత్తయిదువులు అమ్మాయిని పెళ్లికూతురిని చేసే నిమిత్తం నలుగు పెడుతుండగా, సరదాగా పాటందుకుంది. మైకు పట్టుకుని పాట పాడుతుండగా, కరెంట్ షాక్ కొట్టి కిందపడిపోయింది. ఆమెను కాపాడేందుకు జమిలి, సంస, లక్ష్మి అనే అమ్మాయిలు ప్రయత్నించగా, వారికి గాయాలు అయ్యాయి. సునీతను హుటాహుటిన మాచర్ల ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. మరికొన్ని గంటల్లో బాజాభజంత్రీలు మోగాల్సిన చోట అమ్మాయి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.
Guntur District
Macherla
Current Shock
Girl Dies
Marriage

More Telugu News