BJP: కేసీఆర్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా: అమిత్ షా

  • తృతీయ కూటమి ఏర్పాటుపై స్పందించిన బీజేపీ అధ్యక్షుడు
  • ఎన్నో ప్రభుత్వాలు కూటముల ఆధారంగా ఏర్పడ్డాయి
  • కలసి పోటీ చేసే హక్కు ప్రతి పార్టీకీ ఉందన్న అమిత్ షా

భారతావనిలో తృతీయ ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం బిజీగా తిరుగుతున్న ఆయన, ఈ ఉదయం ఫెడరల్ ఫ్రంట్ పై స్పందించారు.

రాజకీయ కూటములను ఏర్పాటు చేసి, కలసికట్టుగా పోటీ చేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని అన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూటముల ఆధారంగానే ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. కన్నడ నాట ఎన్నికలపై వస్తున్న సర్వేలను తాము ఎంతమాత్రమూ నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందన్న వ్యాఖ్యలు ఊహాగానాలేనని, బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అమిత్ షా నిప్పులు చెరిగారు. ప్రజలంతా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారని, తమ ఓటుతో వారే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను తాము అమలు చేస్తున్న పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అభివర్ణించుకుంటోందని ఆరోపించారు.

More Telugu News