India: ఇండియాపై గూఢచర్యానికి పాక్ కొత్త ప్లాన్!

  • రెండు దేశాల మధ్య అసాధారణ మార్పులు
  • భారత్ కు సహకరిస్తున్న అమెరికా
  • త్వరపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది
  • రక్షణ శాఖ విశ్లేషకుడు మారియా సుల్తాన్

ఇండియాపై నిఘా ఉంచి గూఢచర్యం చేసేందుకు సహకరించేలా పాకిస్థాన్ ఓ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. పాకిస్థాన్ వెబ్ సైట్ 'డాన్ న్యూస్' కథనం ప్రకారం, సుమారు 470 కోట్ల రూపాయల వ్యయంతో పాకిస్థాన్ ఓ స్పేస్ ప్రోగ్రామ్ కు రూపకల్పన చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని, ఇందులో భాగంగా అత్యాధునిక శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ రక్షణ శాఖ విశ్లేషకుడు మారియా సుల్తాన్ స్వయంగా వెల్లడించారని తెలిపింది.

"ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక పరిస్థితుల్లో అసాధారణ మార్పులు సంభవిస్తున్నాయి. తొలుత మేము భారత్ పై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత శాటిలైట్ కార్యక్రమాలకు అమెరికా సహకరిస్తుంది. పాకిస్థాన్ త్వరపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విదేశీ శాటిలైట్లపై ఎక్కువకాలం ఆధారపడలేము" అని ఆయన వ్యాఖ్యానించారని పేర్కొంది.

దేశీయ సూపర్ కో (స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఉంటుందని, దీనిలో భాగంగా ఒక్కొక్కటి 135 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నాలుగు శాటిలైట్లు తయారు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయించారని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 200 కోట్ల రూపాయలు కేటాయించనున్నారని అన్నారు.

More Telugu News