fathima babu: స్టాలిన్ కిడ్నాప్ చేశారన్న... నాటి వదంతులపై స్పందించిన న్యూస్ రీడర్ ఫాతిమాబాబు!

  • డీఎంకే నేత స్టాలిన్ నన్ను అపహరించారనేది అబద్ధం
  • నా జీవితంలో అలాంటి ఘటన జరగలేదు
  • నాడు ఓ విలేకరికి వివరణిచ్చినా ప్రచురితం కాలేదు
  • అగ్రనేత పరువుకు భంగం కలిగించే వదంతులు రావడం దారుణం

కొన్నేళ్ల కిందట దూరదర్శన్ తమిళ చానెల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన ఫాతిమాబాబు అప్పట్లో చాలా ఫేమస్. ఆ తర్వాత ‘చిత్తిరపావై’ ధారావాహికలో నటించి నటిగా పేరుతెచ్చుకున్నారు. డీఎంకే నేత స్టాలిన్ నాడు ఆమెను అపహరించుకుపోయాడనే వదంతులు ఇప్పటికీ చలామణిలో ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమెతో ప్రస్తావించడంతో అసలు విషయం వెల్లడించింది.

 తన జీవితంలో అలాంటి ఘటన జరగలేదని, స్టాలిన్ తనను అపహరించినట్టు అప్పట్లో వచ్చిన వదంతులతో దిగ్భ్రాంతి చెందానని .. ఈ విషయమై ఓ వార పత్రిక విలేకరికి తాను వివరణ ఇచ్చినప్పటికి ప్రచురితం కాలేదని చెప్పారు. దూరదర్శన్ లో తాను న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న సమయంలోనే.. ‘చిత్తిరపావై’ ధారావాహికలో నటించే అవకాశం లభించిందని చెప్పింది.

ఆ ధారావాహికలో నటించడం పూర్తయ్యే వరకు వార్తలు చదివేందుకు వీలులేదని నిబంధనలు ఉండేవి. దీంతో, ఆ ధారావాహిక చిత్రీకరణ జరిగిన పదమూడు వారాలు తాను దూరదర్శన్ లో వార్తలు చదవలేదని, ఆ సమయంలోనే తనపై వదంతులు వ్యాపించాయని అన్నారు. ఓ పార్టీ అగ్రనేత పరువుకు భంగం కలిగించే వదంతులు రావడం దారుణమని, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిష్టకు కళంకం ఆపాదించడం ఆమోదయోగ్యం కాదని , ఇకపై ఇలాంటి వదంతులకు వివరణ ఇవ్వబోనని చెప్పారు. కాగా, అన్నాడీఎంకే పార్టీలో ఉన్న ఫాతిమాబాబు ప్రస్తుతం ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.

More Telugu News