Hyderabad: హైదరాబాద్ లో ఇంతే... పిల్లలకు వాహనాలిచ్చిన 26 మంది పేరెంట్స్ కు జైలు శిక్ష!

  • కొడుకులపై ప్రేమతో వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులు
  • పోలీసులకు పట్టుబడితే జైలుకే
  • మైనర్లు చేస్తున్న ప్రమాదాలపై పోలీసుల సీరియస్

కన్న ప్రేమతో కొడుకులు కోరింది కాదనకుండా ఇస్తూ, వారు అడిగారు కదా అని ఖరీదైన బైకులు కొనిస్తున్న తల్లిదండ్రులకు ఇప్పుడు కనువిప్పు కలుగుతోంది. హైదరాబాద్ పరిధిలో వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్న మైనర్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తూ, తల్లిదండ్రులను కోర్టులకు తీసుకెళుతుండగా, వారికి జైలు శిక్షలు పడుతున్నాయి. 26 మంది మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం జాయింట్ కమిషనర్ అనిల్ కుమార్ వెల్లడించారు.

మార్చిలో 20 మంది తల్లిదండ్రులు జైలుకు వెళ్లగా, ఈ నెలలో ఇప్పటివరకూ ఆరుగురు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. తమ బిడ్డలకు లైసెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వరాదని తాము ఎంతగా అవగాహన తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. "ఈ పరిస్థితి మారాలి. కఠిన చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధం. యాక్సిడెంట్ చేసిన ఓ మైనర్ విద్యార్థికి నెల రోజుల జైలు శిక్ష కూడా పడింది. సమాజంలోకి ఓ సందేశం పంపాలన్నదే మా ప్రయత్నం" అని ఆయన అన్నారు.

కాగా, ఈ వారం ప్రారంభంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థినులు మందు కొట్టి, కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసి ఓ వ్యక్తి మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీరంతా 20 సంవత్సరాల లోపు వారేనని, వీరు తమ వయసు గురించిన తప్పుడు ధ్రువపత్రాలతో తిరుగుతున్నట్టు గుర్తించామని అన్నారు.

More Telugu News